కిర్లంపూడిలో ఇప్పుడేం జరుగుతోంది..?

Update: 2016-06-09 07:41 GMT
తుని విధ్వంసం కేసులో అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కాపు ఉద్యమనేత.. మాజీ మంత్రి ముద్రగడ పద్మానాభం ఆమరణ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ముద్రగడ దీక్ష నేపథ్యంలో కిర్లంపూడిలోని ఆయన నివాసం వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తుని విధ్వంసం ఘటనకు బాధ్యులైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవటంపై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు.

గతంలో మాదిరే తన ఇంటి తలుపులు మూసుకొన్న ఆయన తన భార్యతో కలిసి దీక్ష షురూ చేశారు. విషయం తెలుసుకున్నజిల్లా ఎస్పీ రవిప్రకాశ్ ముద్రగడ ఇంటి వద్దకు చేరుకున్నారు. ముద్రగడను అదుపులోకి తీసుకొని జైలుకు తరలించాలన్నది పోలీసుల వ్యూహం కాగా.. దానికి అడ్డు తగులుతూ ఇంటి తలుపుల్ని వేసుకొని ముద్రగడ లోపల ఉండిపోయారు.

దీంతో.. ముద్రగడ ఇంటి తలుపుల్నిబలవంతంగా తెరిచి ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయత్నించారు. ముద్రగడ నివాసం వద్ద ఉన్న ఆయన అనుచరులు.. మద్దుతుదారులు పోలీసుల చర్యను ప్రశ్నించటంతో అక్కడ వాతావరణం గందరగోళంగా మారింది. అదే సమయంలో ముద్రగడ కుమారులు కిటికీ వద్దకు వచ్చి తలుపు తెరిచే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించటంతో పోలీసులు వెనక్కి తగ్గారు.

కాసేపటికి మరోమారు ముద్రగడను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులుప్రయత్నించగా ఈసారి ముద్రగడే సీన్లోకి వచ్చేశారు. పోలీసులు కానీ తలుపులు బలవంతంగా తీసుకొని లోపలికి వస్తే.. తాను పురుగుల మందు తాగుతానంటూ పురుగుల మందు డబ్బా చేతిలో పట్టుకొని చూపించటంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ తిని వెనక్కి తగ్గారు. ముద్రగడను బలవంతంగా అయినా అదుపులోకి తీసుకోవచ్చన్న వ్యూహంతో వచ్చిన పోలీసులకు జరిగిన పరిణామాలు షాకింగ్ గా మారాయి. దీంతో.. ఏం చేయాలో తోచక వారు కిందామీదా పడుతున్న పరిస్థితి. ముద్రగడను పోలీసులు అదుపులోకి తీసుకుంటే  పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందన్న పరిస్థితి కిర్లంపూడిలోనెలకొని ఉంది.
Tags:    

Similar News