టీడీపీ నిజ నిర్ధార‌ణ క‌మిటీ అరెస్టు.. స్టేష‌న్‌కు త‌ర‌లించిన‌ పోలీసులు

Update: 2022-01-21 14:30 GMT
కృష్ణా జిల్లా గుడివాడలో ముందు నుంచి అంద‌రూ అనుకున్న‌ట్టే జ‌రిగింది. మంత్రి కొడాలి నానికి చెందిన కె-క‌న్వెన్ష‌న్‌లో ఈ నెల సంక్రాంతి సంద‌ర్భంగా కేసినో నిర్వ‌హించార‌ని, జూదాలు ఆడించార‌ని.. గోవాలో మాత్ర‌మే క‌నిపించే జూద ప్ర‌క్రియ‌లు ఇప్పుడు గుడివాడలోని కె-క‌న్వెన్ష‌న్‌లో జ‌రిగాయ‌ని..ఈ క్ర‌మంలో రూ.వంద‌ల కోట్లలో మంత్రికి ఆదాయం వ‌చ్చింద‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో అస‌లు అక్క‌డ ఏం జ‌రిగిందో తేల్చాలంటూ..చంద్ర‌బాబు నిజ‌నిర్ధార‌ణ క‌మిటీని వేశారు.

ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు అస‌లు గుడివాడ‌లో ఏం జ‌రిగింద‌నే విష‌యం తేల్చుకునేం దుకు నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ అతి క‌ష్టంపై... గుడివాడ‌కు చేరుకుంది. మ‌ధ్య‌లో పామ‌ర్రు ద‌గ్గ‌ర‌, కంకిపాడు వ‌ద్ద పోలీసులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసినా.. నాయ‌కులు వారికి న‌చ్చ‌జెప్పి మ‌రీ గుడివాడ‌కు చేరుకున్నారు. క‌మిటీలో నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ఆలపాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌, తంగిరాల సౌమ్యలు ఉన్నారు. ఈ కమిటీ...గుడివాడలో క్యాసినో నిర్వహించిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు అక్క‌డ‌కు చేరుకుంది.

అయితే.. తొలుత స్థానిక నేత‌లు.. గుడివాడ సెంట‌ర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్ర‌హానికి పాలాభిషేక్ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో పోలీసులు భారీగా మోహ‌రించిన‌ప్ప‌టికీ.. ఒక‌వైపు నుంచి దూసుకువ‌చ్చిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు టీడీపీ నేత‌ల‌పై దాడి చేసేందుకు య‌త్నించారు. ఈ క్ర‌మంలో పోలీసులు వైసీపీ నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను అదుపు చేయాల్సింది పోయి.. టీడీపీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీని అరెస్టు చేశారు. వెంట‌నే వారిని పోలీసు జీపు ఎక్కించి.. త‌ర‌లించేశారు.  

ఇక‌, ఈ క్ర‌మంలో రెచ్చిపోయిన‌.. వైసీపీ కార్య‌కర్త‌లు.. బొండా ఉమా కారుపై రాళ్ల‌దాడి చేసి వాహ‌నాన్ని ధ్వంసం చేశారు. మ‌రికొంద‌రు కార్య‌క‌ర్త‌లు గుడివాడ‌లోని పార్టీ కార్యాల‌యంపై దాడి చేసి.. ఫ‌ర్నిచ‌ర్‌ను విరగ్గొట్టార‌ని టీడీపీ నాయ‌కులు ఆరోపించారు. మొత్తంగా చూస్తే.. గుడివాడ‌లో నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ఎంట్రీ వివాదాల‌తోనే ముందుకు సాగింది. ఇప్పుడు ఎటు మ‌లుపు తిరుతుందో చూడాలి.
Tags:    

Similar News