హోదాకు చేతకాలేదు ప్యాకేజీకి యుద్ధమా టీజీ

Update: 2017-01-30 16:11 GMT
నవ్విపోతారే అన్న ఆలోచన లేకుండా వెనకా ముందు చూసుకోకుండా మాట్లాడేయటం ఏపీ అధికారపక్షం నేతల్లో ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ఓపక్క తమ నిర్ణయాలతో ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తి.. ఆగ్రహంతో ఉన్నారన్న విషయాన్ని టీడీపీ నేతలు పెద్దగా పట్టించుకోనట్లుగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నాం కదా.. తమకిక తిరుగులేదన్న భావన వారిలో కనిపిస్తోంది. గతంలో ఇదే తీరుతో ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాలకు ఫలితంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి​​ గతి పట్టిందన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు మర్చిపోతున్నట్లు కనిపిస్తోంది.

పదేళ్లు నాన్ స్టాప్ అధికారాన్ని చేపట్టి.. ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయంతో మరికొన్నేళ్లు కోలుకోలేనంత దారుణ పరిస్థితుల్లోకి కాంగ్రెస్ వెళ్లిన విషయాన్ని ఏపీ టీడీపీ నేతలు గుర్తుంచుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. విభజన నేపథ్యంలో ఏపీకి జరుగుతున్న అన్యాయానికి ప్రతిఫలంగా ప్రత్యేక హోదాను నాటి ప్రధాని పార్లమెంటులో ప్రకటించిన వైనం ఏపీ ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. అంతవరకూ ఎందుకు.. ఆర్నెల్ల కిందట వరకూ హోదాపై ఏపీ ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అయ్యారన్నది గుర్తున్న విషయమే. ఎవరైనా మర్చిపోతే.. యూట్యూబ్ లో కొడితే ఆయన చెప్పిన మాటలు వరుసగా వస్తాయి.

మరి.. ఆ రోజు హోదా మీద మాట్లాడిన బాబుతో మొదలు.. టీడీపీ నేతలు ఇప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తున్నారు. మొన్నటికి మొన్న పంది వ్యాఖ్యలతో ఇరుకున పడ్డ కేంద్రమంత్రి సుజనా.. తర్వాత చెంపలేసుకున్న పరిస్థితి. పార్టీకి సేవ చేయకున్నా.. పదవుల్ని సొంతం చేసుకునే విలక్షణమైన నేర్పు ఉన్న మరో నాయకుడు టీజీ వెంకటేశ్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రోళ్లకు మంట పుట్టిస్తున్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని.. ప్యాకేజీ మాత్రమే సాధ్యమని చెబుతున్న ఆయన.. లోక్ సభలో బీజేపీకి మెజార్టీ ఎక్కువగా ఉండటం వల్లే ప్యాకేజీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఏపీ ప్యాకేజీని తప్పక సాధిస్తామని.. ఒకవేళ ఏపీకి సరిపడా ప్యాకేజీ అందకపోతే కేంద్రంపై యుద్ధం తప్పదని ప్రకటించారు. హోదా విషయంలో చేతులెత్తేసి.. ఆ విషయాన్ని కవర్ చేసుకుంటున్నటీడీపీ నేతలు.. కేంద్రం పై యుద్ధం చేసేంత సీన్ ఉంటుందా? మాట వరసకు ఏదో మాట్లాడుతున్న టీజీ.. ఒక్కరోజంటే ఒక్కరోజు ఆంధ్రోళ్ల కోసం ఆరాటపడ్డారా? అన్నది ప్రశ్న. ఇలాంటి నేతలంతా పదవులు దక్కించుకుంటే ఏపీకి హోదా ఎందుకు వస్తుంది..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News