ఇండియా కూటమిలో జగన్ కి గ్రాండ్ వెల్ కం ?

మళ్ళీ కూటమిగానే పోటీ చేస్తున్నామని అంటున్నారు.

Update: 2024-10-22 17:30 GMT

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఎన్డీయేలో టీడీపీ జనసేన బీజేపీ ఉన్నాయి. ఈ ఘట్ బంధన్ జమిలి ఎన్నికలు వచ్చినా లేక 2029 లో ఎన్నికలు వచ్చినా కూడా కొనసాగుతుందని అంటున్నారు. ఇదే విషయం చంద్రబాబు చెబుతున్నారు.

మళ్ళీ కూటమిగానే పోటీ చేస్తున్నామని అంటున్నారు. సో ఎన్డీయే కూటమి అన్నది వచ్చే ఎన్నికల్లోనూ ఫిక్స్. ఇదిలా ఉంటే ఏపీలో ఇండియా కూటమి సంగతేంటి అన్న చర్చ అయితే ఉంది. ఇండియా కూటమి అంటే ప్రస్తుతం కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉన్నారు. ఈ రెండు పార్టీలు బలహీనంగానే ఉన్నాయి. ఇక వీరితో బలమైన మరో ప్రాంతీయ పార్టీ జట్టు కడితే కనుక ఏపీలో ఇండియా కూటమి బలంగా మారుతుంది.

ఆ ప్రాంతీయ పార్టీ వైసీపీ కావచ్చు అని అంటున్నారు. ఇదే విషయం మీద కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసీరెడ్డిని ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో ప్రశ్నించినపుడు ఆయన జగన్ కనుక ఇండియా కూటమిలోకి వస్తామంటే వెల్ కం అని చెప్పేశారు. పైగా ఏపీలో బలమైన కూటమిగా ఇండియా కూటమి ఉంటుందని అన్నారు.

తాము ప్రస్తుతం టీడీపీని జనసేనను, బీజేపీనీ విమర్శిస్తున్నామని అదే పంధాలో వైసీపీని కూడా విమర్శిస్తున్నామని అన్నారు. తామే కాదు కమ్యూనిస్టులు కూడా టార్గెట్ చేస్తున్నారు అని అన్నారు. అదే ఇండియా కూటమిలోకి వస్తే వైసీపీ కూడా పటిష్టంగా ఉంటుందని అన్నారు.

దేశ రాజకీయ ప్రయోజనాల రిత్యా కాంగ్రెస్ ఏపీలో నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇండియా కూటమి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తప్పకుండా వస్తుందని అదే సమయంలో ఏపీలో కూడా కాంగ్రెస్ తన వంతు పాత్రను పోషిస్తుందని అన్నారు. అలా వైసీపీ వంటి పార్టీలు జట్టు కడతామంటే కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తుందని అన్నారు.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీని వ్యతిరేకిస్తున్నారు కదా అన్న దానిని ఆయన బదులిస్తూ కాంగ్రెస్ లో హై కమాండ్ నిర్ణయమే సుప్రీం అని తులసీరెడ్డి అన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తామని షర్మిల పదే పదే చెబుతున్నారని అందువల్ల కాంగ్రెస్ హితం కోసం అధినాయకత్వం తీసుకునే ఏ నిర్ణయం అయినా అంతా మద్దతు ఇస్తామని అన్నారు.

ఇక జగన్ బీజేపీల మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయని అన్న దానికి బదులిస్తూ జగన్ బీజేపీల మధ్య 2019 నుంచి 2024 మధ్యలో బాగానే ఉన్నాయని అయితే 2024 ఎన్నికల తరువాత సీన్ మారిందని బీజేపీ టీడీపీ జనసేన పొత్తులు కలిశాయని. దాంతో జగన్ అవసరం బీజేపీకి లేదని అర్ధమవుతోందని అన్నారు.

ఈ పరిణామాలే కాకుండా ఏపీలో ఎన్నడూ లేని విధంగా కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో వైసీపీకి కూడా ఒంటరిగా ఎన్డీయేను ఎదుర్కోవడం కష్టమే అవుతుందని అన్నారు. అలా కనుక చూసుకుంటే వైసీపీతో కూడిన ఇండియా కూటమి అయితే ఎన్డీయేను ధీటుగా ఎదుర్కోవడం తధ్యమని ఆయన అంటున్నారు.

జగన్ ఇండియా కూటమిలోకి వెళ్తున్నారు అని అధికార పక్షం ప్రచారం చేయడం వెనక అనేక వ్యూహాలు ఉన్నాయని ఆయన మీద బీజేపీని గట్టిగా ప్రయోగించి ఇబ్బందుల పాలు చేయడం ఒక వ్యూహమైతే వైసీపీని గందరగోళంలో పెట్టడం కూడా మరో వ్యూహం అయి ఉంటుందని అన్నారు.

మొత్తానికి తులసీరెడ్డి వంటి వారు చెబుతున్న దానిని బట్టి చూస్తే కనుక ఏపీలో కొత్త రాజకీయ సమీకరణలు సంభవించే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయనే అంటున్నార్. అంతే కాదు ఏపీలో వైసీపీ ప్లస్ కాంగ్రెస్ అంటే ఈ నయా కాంబినేషన్ తో రాజకీయాల్లో కీలక మార్పులు సంభవించవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి నిజంగా ఇలాగే జరుగుతుందా, ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అన్నది.

Tags:    

Similar News