పాపం టీజీ.. సైకిల్ దిగలేక.. 'ఫ్యాన్' వేయలేక..

Update: 2019-06-09 10:07 GMT
అదృష్టం అంటే టీజీ వెంకటేశ్ దే.. ఆయన ఓడినా.. గెలిచినా బిందాస్ గా ఉంటారు. ఎందుకంటే గెలిచిన పార్టీలోకి జంప్ చేసి  ఆ పార్టీ ద్వారా పదవులు పొందుతారు. బడా పారిశ్రామికవేత్త అయిన ఈయన ఆర్థిక అండదండలు పుష్కలంగా అందించడంతోపాటు కర్నూలులో బలమైన నేతగా ఉండడంతో  తెలుగు రాష్ట్రాల్లోని ఏ పార్టీ కూడా ఆయన రాకను కాదనదు..

టీజీ వెంకటేశ్ తన రాజకీయ కెరీర్ ను 1999లో మొదలు పెట్టాడు. తొలిసారి 1999లోనే టీడీపీ తరుఫున పోటీచేసి  ఎమ్మెల్యేగా గెలిచారు.అప్పుడు టీడీపీనే పవర్ లోకి వచ్చింది. ఇక   2004లో టీడీపీ తరుఫున నిలబడి టీజీ వెంకటేశ్ ఓటమి పాలయ్యారు. అప్పుడు వైఎస్ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో వెంటనే ఆయన   టీడీపీ కాడి వదిలేసి వైఎస్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అలా పదేళ్లు 2014 వరకు కాంగ్రెస్ లో మంత్రిగా కొనసాగారు.

ఇక రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కనుమరుగైంది. దీంతో తెలివిగా అధికారంలోకి వచ్చిన టీడీపీలో చేరారు టీజీ వెంకటేశ్.. ఏకంగా బాబును మచ్చిక చేసుకొని టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇంకా పదవి కాలం ఉంది. ఇక మొన్నటి 2019 సార్వత్రిక ఎన్నికల వేళ తను పోటీచేయకుండా తన కొడుకును కర్నూలు అసెంబ్లీ నుంచి పోటీచేయించారు. టీడీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిని పక్కనపెట్టించి మరీ కొడుకును ఎమ్మెల్యే తెప్పించుకొని గెలిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించారు..

కానీ వైసీపీ గాలిలో కర్నూలులో టీజీ వెంకటేశ్ కొట్టుకుపోయారు. ఆయన కుమారుడు చిత్తుగా ఓడారు. ప్రతిసారి రాజకీయాల్లోకి వచ్చాక అధికార పార్టీలో చేరుతూ పదవులను అనుభవిస్తున్న టీజీ ఇప్పుడు వైసీపీలో చేరాలనుకున్నా జగన్ ఇలా ఫిరాయింపులను ప్రోత్సహించే రకం కాదు.. పదవులకు రాజీనామా చేసి రమ్మంటాడు. దీంతో అనవసరంగా రాజ్యసభ ఎంపీ సీటును టీజీ త్యాగం చేసి వచ్చేంత ధైర్యం లేదు. దీంతో టీజీ ఇప్పుడు తొలిసారి అధికారంలో లేకుండా ఐదేళ్లు గడపాల్సి ఉంటుంది. లేదా బీజేపీ లో చేరి ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో రాజకీయం చేయాల్సి ఉంటుంది. ఇలా జగన్ నీట్ పాలిటిక్స్ తో పాపం టీజీకి ఈసారి అధికారం లేకుండా పోయింది.


Tags:    

Similar News