9 రోజులు.. 170 విమానాలు.. బెదిరింపుల నష్టం ఎన్ని వందల కోట్లంటే..?
అవును... విమానయాన సంస్థలకు గత కొద్దిరోజులుగా వస్తున్న బాంబు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా మరోసారి భారీ సంఖ్యలో బెదిరింపులు వచ్చాయి.
గత కొన్ని రోజులుగా విమానాలకు వస్తోన్న బాంబు బెదిరింపులు ఎంత చర్చనీయాంశం అయ్యాయి అనేది తెలిసిన విషయమే. ఈ బాంబు బెదిరింపులకు పాల్పడినవారిని నో-ఫ్లై జాబితాలో చేరుస్తామని చెప్పినా.. ఇలాంటి పనులకు పాల్పడేవారికి జీవిత ఖైదు విదించే దిశగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినా అవి ఆగడం లేదు.
అవును... విమానయాన సంస్థలకు గత కొద్దిరోజులుగా వస్తున్న బాంబు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా మరోసారి భారీ సంఖ్యలో బెదిరింపులు వచ్చాయి. ఇందులో భాగంగా... సోమవారం నుంచి మంగళవారం మధ్య 24 గంటల వ్యవధిలో సుమారు 80 డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమాన సర్వీసులకు హెచ్చరికలు వచ్చాయి.
ఈ విషయాలను "బాంబ్ థ్రెట్ ఎవల్యూషన్ కమిటీ" ప్రకటించింది. దీంతో... గడిచిన 9 రోజుల్లో బెదిరింపులకు గురైన విమానాల సంఖ్య 170కి చేరిందని అంటున్నారు. ఈ బెదిరింపుల వల్ల విమానయాన సంస్థలకు జరిగిన నష్టం భారీగా ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఈ అంతరాయాల వల్ల రూ.600 కోట్ల నష్టం వాటిల్లుతుందని అధికారులు అంటున్నారు.
కాగా... విమానయాన సంస్థలను, విమాన ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న బెదిరింపుల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బెదిరింపులకు పాల్పడేవారిని నో-ఫ్లై జాబితాలో చేర్చేలా చట్టాలను సవరిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇదే సమయంలో... ఇప్పటివరకూ వచ్చిన బెదిరింపులు అన్నీ బూటకమే అని తేలిందని అని స్పష్టం చేశారు. ఏది ఏమైనా... ఇలా బెదిరింపు కాల్స్, బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులకు పాల్పడేవారికి జీవిత ఖైదు విధించేలా చట్టపరమైన మార్పులు తెచ్చేందుకు యత్నిస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో కోర్టు ఉత్తర్వులు లేకుండానే విమానంలో నేరాలపై దర్యాప్తు ప్రారంభించి.. దోషులను వెంటనే అరెస్ట్ చేసేందుకు వీలుగా పౌర విమానయాన భద్రత కింద నిబంధనలను సవరించే దిశగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వీరిని కఠినంగా శిక్షించేలా నిబంధనలు మార్చే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.