కొడుకు పొలిటికల్ కెరీర్ కోసం పార్టీ మారుతున్నాడా!?

Update: 2019-03-07 17:30 GMT
కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఝలక్ తగలనుందని ప్రచారం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అయ్యారట.. ఎంపీ టీజీ వెంకటేష్ - ఆయన తనయుడు టీజీ భరత్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి వీరు రంగం సిద్ధం చేసుకొంటూ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అందుకు ముహూర్తం కూడా కుదిరిందని.. మార్చి పదమూడో తేదీన వీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారని వార్తలు వస్తున్నాయి.

కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ను ఆశిస్తున్నారు టీజీ కుటుంబీకులు. తన తనయుడు భరత్ ను అక్కడ నుంచి పోటీ చేయించాలని టీజీ వెంకటేష్ ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాడు. అయితే తెలుగుదేశం పార్టీలో ఈ అంశం లభించడం ప్రశ్నార్థకంగా ఉంది.

కర్నూలులో తెలుగుదేశం పార్టీ తరఫున ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకే టికెట్ దక్కనుందనే ప్రచారం జరుగుతూ ఉంది. ఎస్వీ మోహన్ రెడ్డికి టికెట్ కేటాయించినా.. గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫిరాయింపు నేత కావడంతో జనాలు ఆయనను ఛీత్కరించుకొంటూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు ఎస్వీ వైపే మొగ్గు చూపుతూ ఉన్నారట.

తన తనయుడికి టికెట్ దక్కకపోతే తాము పార్టీని వీడటమే అని ఇది వరకే టీజీ వెంకటేష్ కుండబద్ధలు కొట్టినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో అదే జరగబోతోందని.. వచ్చే వారంలో జగన్ ఆధ్వర్యంలో టీజీ వెంకటేష్, ఆయన తనయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఖాయమని ప్రచారం జరుగుతూ ఉంది.
Tags:    

Similar News