పీకే వార్నింగ్‌!... టీజీ కూల్ రిప్లై!

Update: 2019-01-23 16:16 GMT
తెలుగు దేశం ఎంపీ టీజీ వెంక‌టేశ్ లాలింపు మాట‌లు - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫైరింగ్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఇప్పుడు.... టీడీపీ - జ‌న‌సేన మ‌ధ్య వార్ ఆఫ్ వ‌ర్డ్స్ న‌డుస్తున్నాయి. అస‌లు టీడీపీతో పొత్తు స‌మ‌స్యే లేద‌ని ప‌వ‌న్ చెబుతున్నా... టీడీపీ మాత్రం ఏమాత్రం చిన్న అవ‌కాశం దొరికినా... ప‌వ‌న్‌ను దారికి తెచ్చుకునేందుకు త‌న‌దైన శైలి య‌త్నాలు చేస్తూనే ఉంది. ఓ వైపు ప‌వ‌న్ ప‌వ‌ర్ ఫుల్ పంచ్ ల‌తో ఏకంగా వార్నింగులు ఇస్తున్నా... టీడీపీ నేత‌లు మాత్రం కూల్ కూల్ గానే స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇత‌ర పార్టీల నేత‌ల‌పై అకార‌ణంగా విరుచుకుప‌డే తెలుగు త‌మ్ముళ్లు ప‌వ‌న్ విష‌యంలో మాత్రం ఈ కూల్ నెస్‌నే అవ‌లంబిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ - జ‌న‌సేన‌ల మ‌ధ్య పొత్తు ఉండే అవ‌కాశం లేక‌పోలేద‌ని - అయితే ఆ విష‌యాన్ని త‌మ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు - జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ లే నిర్ణ‌యించాల‌ని - కార్య‌క‌ర్త‌లుగా తాము మాత్రం... ఇరు పార్టీల మ‌ధ్య పొత్తు ఉంటేనే బాగుంటుంద‌ని భావిస్తున్నామ‌ని టీజీ కామెంట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ కామెంట్ చెవిన ప‌డిన వెంటనే ప‌వ‌న్ ఓ రేంజిలో ఫైరైపోయారు. టీజీకి గ‌ట్టిగానే త‌లంటేశారు. మ‌రోమారు ఈ త‌ర‌హా పొత్తు వ్యాఖ్య‌లు చేస్తే స‌హించేది లేద‌ని కూడా వార్నింగ్ ఇచ్చారు. ప‌వ‌న్ వార్నింగ్‌లు చెవిన ప‌డిన తర్వాత.... సాధార‌ణంగా టీజీ కూడా అదే రేంజిలో ఫైరైపోతార‌ని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా కూల్ మంత్రాన్ని అవ‌లంబించిన టీజీ తాన‌న్న మాట‌లో త‌ప్పేముంద‌ని కొత్త త‌ర‌హా వాద‌న‌ను వినిపించారు. పార్టీ శ్రేయ‌స్సును కాంక్షించే నేత‌గా జ‌న‌సేన‌తో టీడీపీకి పొత్తు కుదిరితే బాగుంటుంద‌ని భావించాన‌ని - ఇందులో త‌ప్పేముంద‌ని కూడా టీజీ వితండ వాద‌న వినిపించారు. అయినా పవ‌న్ ఈ రేంజిలో ఫైర‌య్యేంత త‌ప్పుడు వ్యాఖ్య‌లు తానేం చేశాన‌ని కూడా టీజీ కామెంట్ చేయ‌డం నిజంగానే ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న‌ను ప‌వ‌న్ పెద్ద మ‌నిషిగా ప‌రిగ‌ణించార‌ని - తాను కూడా త‌న పెద్ద‌రికానికి త‌గ్గ‌ట్టుగానే ప్ర‌తిస్పందిస్తున్నాన‌న్న కోణంలో చాలా వ్యాఖ్య‌లే చేశారు. పార్టీ నేత‌లు - కార్య‌కర్త‌ల‌కు ఆవేశ‌కావేశాలు ఉన్నా... పార్టీ అధినేత‌ల‌కు మాత్రం ఈ ఆవేశాలు - ఫైరింగులు ప‌నికి రావ‌ని తెలిపారు.

రాజ‌కీయాల్లో క‌ల‌కాలం కొన‌సాగాలంటే... ఆయా పార్టీల అధినేత‌ల‌కు స‌హ‌నం అవ‌స‌ర‌మ‌ని కూడా చెప్పుకొచ్చారు. పార్టీ అధినేత‌లు ఆగ్ర‌హావేశాల‌తో ఊగిపోతే... పార్టీల‌తో పాటు కార్య‌క‌ర్త‌ల భ‌విష్య‌త్తు కూడా ప్ర‌మాదంలో ప‌డటం ఖాయ‌మేన‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ గుర్తించాల‌ని కూడా టీజీ వెంక‌టేశ్ స‌న్నాయి నొక్కులు నొక్కారు. అయినా తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను పూర్తిగా విన‌కుండానే ప‌వ‌న్ స్పందించిన‌ట్టున్నార‌ని - త‌న కామెంట్ల‌కు సంబంధించి పూర్తి సారాంశం తెల‌సుకుని మాట్లాడాల‌ని కూడా ఆయ‌న కోరారు. మొత్తంగా ప‌వ‌న్ ఓ రేంజిలో ఫైరైపోయినా... టీజీ మాత్రం కూల్ కూల్ గానే స్పందించ‌డం వెనుక టీడీపీ అధినేత చంద్ర‌బాబు మార్కు డైరెక్ష‌నే కార‌ణ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News