ప‌ద్మ‌శాలీల డిమాండ్లు విన‌బ‌డుతున్నాయా...?

Update: 2023-02-23 20:14 GMT
రాష్ట్రంలో అనేక బీసీ కులాలు..ఉప కులాలు ఉన్నాయి. వాట‌న్నింటికీ..ప్ర‌స్తుత వైసీపీ ప్ర‌భుత్వం కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసింది. నిజానికి.. టీడీపీ హ‌యాంలోనే ఈ కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు చేశారు. ఇక‌, ఇప్పుడు వాటిని కూడా విభ‌జించి.. 56 కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా తాము రికార్డు సృష్టించామ‌ని.. వైసీపీ నేత‌లు చెప్పుకొంటున్నారు. మ‌రీ ముఖ్యంగా కొన్ని సామాజిక వ‌ర్గాల‌కు(బీసీల్లోనే) మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చారు. అయితే.. జ‌గ‌న్ చేసిన ఈ సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌తో ఆయా బీసీ వ‌ర్గాలు సంతోషంగానే ఉన్నాయా? అనేది ప్ర‌శ్న‌.

ఈ విష‌యాన్ని తాజాగా ప‌రిశీలిస్తే.. ప‌ద్మ‌శాలీయ వ‌ర్గం.. తాజాగా గ‌ళం విప్పింది. రోడ్డెక్కింది. ''జ‌గ‌న్ స‌ర్‌.. మాకేం చేశారు? '' అని నిల‌దీసింది. అంతేకాదు.. తాజాగా ఈ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చామ‌ని.. ప‌ద్మ‌శాలీయ వ‌ర్గాన్ని డెవ‌ల‌ప్ చేస్తున్నామ‌ని.. వైసీపీ నేత‌లు చెబుతున్న మాట‌ల‌ను కూడా ఈ సామాజిక వ‌ర్గం తీవ్రంగా ఖండించింది.

అస‌లు ప్ర‌స్తుతం మ‌రోసారి ఎమ్మెల్సీని చేసిన పోతుల సునీత త‌మ వ‌ర్గ‌మే కాద‌ని.. చెప్పుకొచ్చింది. దొడ్డిదారిలో ఆమె త‌మ కులం కార్డును వినియోగించుకుంటున్నార‌ని కూడా నాయ‌కులు ఆరోపించారు.

క‌ట్ చేస్తే.. ఈ సంద‌ర్భంగా ప‌ద్మ‌శాలీయ వ‌ర్గం.. కొన్ని సంచ‌ల‌న డిమాండ్ లు చేసింది. త‌మ వ‌ర్గం ఓట్లు రాష్ట్రంలో 25 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్నాయ‌ని పేర్కొంది. ఈ ఓట్లు కావాలంటే.. వైసీపీత‌మ‌కు అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని కూడా డిమాండ్ చేసింది.

ప్ర‌తి జిల్లాకు రెండు అసెంబ్లీ టికెట్ల‌ను త‌మ‌కు కేటాయించాల‌ని.. మ‌హిళ‌ల‌కు 5 సీట్లు ఖ‌చ్చితంగా ఇవ్వాల‌ని.. పేర్కొంది. అంతేకాదు.. త‌మ‌కు ప్ర‌త్యేక కార్ప‌స్ ఫండ్‌ను ఏర్పాటు చేసి.. త‌మ వృత్తిని ర‌క్షించుకునేలా చ‌ర్య‌లు తీసుకునేందుకు న‌డుం బిగించాల‌ని కూడా కోరింది.

అంటే.. మొత్తంగా, ప‌ద్మ‌శాలీయ వ‌ర్గం ఇప్పుడు వైసీపీపై తిర‌గ‌బ‌డింద‌నే సంకేతాలు ఇచ్చేసింది. వాస్త‌వానికి వీరు శాసిస్తున్న‌ట్టు గా చెప్పుకొనే రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు ఇప్పుడు వైసీపీకి అత్యంత అవ‌స‌రం. మంగ‌ళ‌గిరి, చీరాల వంటివాటిలో విజ‌యం ద‌క్కించుకుని.. టీడీపీకి భారీ షాక్ ఇవ్వాల‌నే వ్యూహంతో వైసీపీ ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలోనే ఇటు.. మంగ‌ళ‌గిరిలో టీడీపీ మాజీ నాయ‌కుడు చిరంజీవికి నామినేటెడ్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. అదే స‌మ‌యంలో చీరాల‌కు చెందిన వ్య‌క్తిని అని చెప్పుకొనే సునీత‌కు మ‌రోసారి ఎమ్మెల్సీ ఇచ్చింది. కానీ, ఇప్పుడు ఇదే వ‌ర్గం వైసీపీపై నిప్పులు చెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News