ప్రగతి భవన్ టు జిల్లాలు.. కేసీఆర్ వచ్చింది అందుకేనా?

Update: 2021-06-23 02:30 GMT
ఎంకిపెళ్లి సుబ్బు చావు కొచ్చిందంటే ఇదేనేమో.. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎఫెక్ట్ కేసీఆర్ పై బాగానే పడిందని అంటున్నారు. ఎంతలా అంటే కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేసే అంతలా.. ఎందరు విమర్శించినా కేసీఆర్ మాత్రం ప్రజలతో సహవాసం చేసింది చాలా తక్కువనే. అయితే ప్రగతి భవన్. లేదంటే ఫాంహౌస్. ఇలా రెండింటిలోనూ ప్రజలను కలుసుకునేందుకు కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వడనే విమర్శ తెలంగాణ రాజకీయవర్గాల్లో ఉంది.

అయితే తాజాగా కేసీఆర్ కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ భర్తరఫ్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. బీజేపీలో ఈటల చేరడం.. వారందరూ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేయడంతో ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చేయాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

అందుకే తన సహజశైలికి భిన్నంగా కేసీఆర్ జిల్లాల పర్యటనల బాట పట్టారని అంటున్నారు. కేవలం ఎన్నికల కోసం మాత్రమే కేసీఆర్ జిల్లాలు, నియోజకవర్గాలకు వస్తారని ఈటల సంచలన విమర్శలు చేశారు. దీంతో ఆ అపవాదును ముందే పోగొట్టాలని కేసీఆర్ ఇలా హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే హైదరాబాద్ వదిలి జిల్లాలకు వచ్చారని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.

తెలంగాణలో అభివృద్ధిని చూపి హుజూరాబాద్ లో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారు. ఇందుకోసమే ఏకంగా 35 కోట్లను హుజూరాబాద్ కు కేసీఆర్ కేటాయించారని అంటున్నారు.. ప్రజలకు దూరం అన్న అపవాదు పోడగొట్టుకోవడంతోపాటు.. ఈటలను ఓడించి బీజేపీని ఎదగకుండా వచ్చే ఎన్నికల ముందే కాపుకాయకుండా చేయడమే ప్రధాన లక్ష్యంగా కేసీఆర్ జిల్లాల పర్యటన పెట్టుకుంటున్నట్గుగా తెలుస్తోంది.

ఈటల గెలిస్తే బీజేపీ వాయిస్ రేజ్ అవుతుంది. ఈటలకు పట్టపగ్గాలుండవు. టీఆర్ఎస్ గుట్టుమట్లు అన్నీ తెలిసిన ఈటల విమర్శలతో  టీఆర్ఎస్ కు రాజకీయంగా తీవ్ర నష్టం. అందుకే ముందుగానే ఈ ఉపద్రవానికి కళ్లెం వేయాలని కేసీఆర్ చూస్తున్నారు. కానీ నాలుగు సార్లు హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటలను ఆయన సొంతగడ్డపై కొట్టడం అంత ఈజీ కాదంటున్నారు. పైగా బర్తరఫ్ చేసిన ఈటలపై అక్కడి ప్రజల్లో సానుభూతి ఉంది. దీంతో హుజూరాబాద్ కోటను బద్దలు కొట్టడం కష్టమేనన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.
Tags:    

Similar News