తెలంగాణ‌లో ఆ స్థానాల‌ పై బీజేపీ క‌న్ను

Update: 2021-12-28 23:30 GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టికే అధికార టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎదిగే దిశ‌గా వేగంగా దూసుకెళ్తోన్న ఆ పార్టీ ఇప్పుడు మ‌రింత దూకుడు పెంచ‌నుంది. తెలంగాణ‌లో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో? అనే విష‌యంపై ఓ స్ప‌ష్ట‌త‌తో ముంద‌డుగు వేస్తోంది.

ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లోని ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వ్‌డ్ అసెంబ్లీ స్థానాల‌పై ఆ పార్టీ క‌న్నేసింద‌ని స‌మాచారం. ఈ రిజ‌ర్వ్‌డ్ స్థానాల్లో స‌గం గెలుచుకుంటే రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డం సులువ‌వుతంద‌ని పార్టీ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

గ‌తేడాది నుంచి తెలంగాణ‌లో బీజేపీ దూకుడు కొన‌సాగుతోంది. దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌తో పాటు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ఆ పార్టీ ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. మ‌రోవైపు పార్టీ బ‌లోపేతం కోసం ఉద్య‌మ నేప‌థ్యం ఉన్న నాయ‌కుల‌ను చేర్చుకునేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంది.

రాష్ట్రంలో ప్ర‌స్తుత ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతంపై దృష్టి పెట్టారు. ఇక్క‌డి బీజేపీ ఎంపీల‌ను, నాయ‌కుల‌కు పిలిపించుకుని స‌మావేశాలు నిర్వ‌హించారు. పార్టీ నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ‌లో అధికారంలోకి రావాలంటే 60 సీట్లు గెల‌వాలి. అయితే బీజేపీ 70 సీట్లు ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న‌ట్లు తెలిసింది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డి 31 ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వ్‌డ్ స్థానాల‌పై పార్టీ ఫోక‌స్ పెట్టింది. వీటిల్లో స‌గం గెలిచినా అధికారంలోకి రావొచ్చ‌ని భావిస్తోంది. కానీ ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ అంత బ‌లంగా లేదు.

దీంతో ఇక్క‌డ ఎలా గెల‌వాల‌నే దానిపై ఇప్ప‌టి నుంచే వ్యూహాలు ర‌చిస్తోంది. అందులో భాగంగానే ముందుగా ఇక్క‌డ ఇంఛార్జీల‌ను నియ‌మించే ఆలోచ‌న‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అలా నియ‌మించిన ఇంఛార్జీల‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తామ‌నే భ‌రోసా ఇస్తుంద‌ని టాక్‌.

ఇప్పిటికే ఈ విష‌యంపై కేంద్ర నాయ‌క‌త్వంతో రాష్ట్ర నాయ‌క‌త్వం సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలిసింది. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాగానే ఇంఛార్జీల‌ను నియ‌మించనున్నారు. ఆ త‌ర్వాత ఎస్సీ, ఎస్టీల‌కు ఇచ్చిన హామీల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం తీర్చ‌క‌పోవ‌డంతో రాష్ట్ర స్థాయిలో పోరాటం చేయాల‌ని బీజేపీ అనుకుంటోంది. దీంతో ఆయా వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకోవ‌చ్చ‌ని చూస్తోంది.
Tags:    

Similar News