అటు కేసీఆర్‌.. ఇటు జ‌గ‌న్‌.. అదే తేడా!

Update: 2021-11-03 10:30 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో ఆస‌క్తి రేపిన ఉప ఎన్నిక స‌మ‌రం ముగిసింది. విజేత‌లు ఎవ‌రో తేలిపోయింది. కొన్ని రోజులుగా సాగిన రాజ‌కీయ పోరుకు ముగింపు ల‌భించింది. అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో అధికార వైసీపీ అభ్య‌ర్థి సుధ సంచ‌ల‌న మెజార్టీతో విజ‌యం సాధించింది. ఇటు తెలంగాణ‌లో చూస్తే ఆత్మ‌గౌర‌వ నినాదంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ గెలుపు ఖాతాలో వేసుకున్నారు. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప‌రిశీలిస్తే ఓ అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏపీలో అధికార వైసీపీకి సీటు ద‌క్కితే. . ఇటు తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ ఓట‌మి పాలైంది.

ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా.. ఎప్పుడు వ‌చ్చినా అధికార పార్టీకి గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయ‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. ఇక ప్ర‌భుత్వంలో ఓ పార్టీ కొలువు దీరిన త‌ర్వాత వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీదే విజ‌య‌మ‌నే అంచ‌నాలు మెండుగా ఉంటాయి. ఎందుకంటే అప్ప‌టికే ఆ పార్టీకి ప్ర‌జ‌ల ఆశీర్వాదాలు ఉండ‌డం.. త‌మ పాల‌న‌లో చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డం ద్వారా ఓట్లు పొందే అవ‌కాశం ఉంటుంది. అంతే కాకుండా ఇక తెర‌వెన‌క అధికార బ‌లాన్ని ఉప‌యోగించి ఎలాగైనా విజ‌యం సాధించే అవ‌కాశాలు అధికార పార్టీకే ఎక్కువ‌. అయితే అన్నింటికంటే ముఖ్యంగా ప్ర‌జ‌ల అభిమానం ఉంటేనే ఎన్నిక‌ల్లో విజ‌యం త‌థ్య‌మ‌నే సంగ‌తి ఎప్ప‌టిక‌ప్పుడూ రుజువ‌వుతూనే ఉంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యంతో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించారు. ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌తో అఖండ విజ‌యాన్ని సాధించారు. జ‌గన్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా వైసీపీ పార్టీపై ప్ర‌జ‌ల అభిమానం ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతూనే ఉంది. ప్ర‌తిప‌క్షాలు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా.. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ఆరోప‌ణ‌లు చేసినా.. సంక్షేమ పథ‌కాలు అమ‌లు చేస్తున్న జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు ఎప్ప‌టిక‌ప్పుడూ ఆశీర్వ‌దిస్తూనే ఉన్నారు. స‌ర్పంచ్, పుర‌పాల‌క‌, మండ‌ల, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో ఆ విష‌యం స్ప‌ష్ట‌మైంది. అలాగే తిరుప‌తి పార్ల‌మెంట్ స్థానం ఉప ఎన్నిక‌లోనూ ఆ పార్టీకి ఘ‌న విజ‌యం ద‌క్కింది. ఇప్పుడు బ‌ద్వేలులోనూ ప్ర‌జ‌లు ఆ పార్టీ వైపే నిలిచారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ప్ర‌జ‌ల త‌న ప‌క్షానే నిలుస్తార‌ని జ‌గ‌న్ ఆత్మ‌విశ్వాసంతో ఉన్నారు.

ఇక తెలంగాణ‌లో చూసుకుంటే వ‌రుస‌గా రెండో సారి ప్ర‌భుత్వంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతుంద‌నే అభిప్రాయాలున్నాయి. గ‌తంలో తిరుగులేని కేసీఆర్‌కు ఇప్పుడు ప్ర‌త్య‌ర్థి పార్టీలు స‌వాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా కొత్త రాష్ట్ర అధ్య‌క్షుల సార‌థ్యంలో బీజేపీ, కాంగ్రెస్ దూసుకెళ్తున్నాయి. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తున్నాయి. మ‌రోవైపు రెండో సారి అధికారం చేప‌ట్టిన త‌ర్వాత కేసీఆర్ వైఖ‌రి కూడా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కేవ‌లం ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నార‌ని, ఎన్నిక ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనే నిధులు విడుద‌ల చేసి మిగ‌తా వాటిని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని నియంతృత్వ పాల‌న చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లున్నాయి. ప్ర‌జ‌లు కూడా వాస్త‌వ ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుంటున్నారు. అందుకే దుబ్బాక ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌ను గెలిపించి టీఆర్ఎస్‌కు షాకిచ్చారు. ఆ త‌ర్వాత జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్‌పై దెబ్బ ప‌డింది. ఇక ఇప్పుడు కేసీఆర్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న హుజూరాబాద్‌లోనూ ప్ర‌జ‌లు ఈట‌ల వైపు నిలిచారు. దీంతో వ‌చ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయోన‌నే ఆస‌క్తి ఇప్ప‌డే మొద‌లైంది.
Tags:    

Similar News