కరోనా ఎఫెక్ట్ : యూకే విమానాల‌పై కేంద్రం నిషేధం !

Update: 2020-12-21 13:00 GMT
కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గిపోకమునుపే ... బ‌్రిట‌న్ ‌లో కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీనితో అక్కడ మళ్లీ లాక్ డౌన్ విధించిన ఆ ప్రభుత్వం. ఈ నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. యూకే నుంచి వ‌చ్చే విమానాల‌పై తాత్కాలికంగా నిషేధం విధించింది. డిసెంబర్ 31 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని పౌర విమానయాన శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

యూకే నుంచి ఇప్పటికే బయల్దేరిన, మంగళవారం అర్దరాత్రి 12 గంటల లోపు ఆయా విమానాల ద్వారా ఇక్కడికి చేరుకోనున్న ప్రయాణికులకు ఎయిర్‌ పోర్టులలో పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారని విమానయాన శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది.

ఈ నెల 22వ తేదీ రాత్రి 11.59 గంట‌ల నుంచి డిసెంబ‌ర్ 31 రాత్రి 11.59 గంట‌ల వ‌ర‌కు యూకే నుంచి వ‌చ్చే విమానాల‌కు అనుమ‌తి లేదు అని కేంద్ర విమానయాన శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టికే ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, బెల్జియం, కెన‌డా, ఇట‌లీ, ఆస్ట్రియా వంటి దేశాలు యూకే నుంచి వ‌చ్చే విమానాల‌ను నిషేధించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం యూకే నుంచి వ‌స్తున్న విమానాల్లో ఉన్న ప్ర‌యాణికుల‌కు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌ను త‌ప్ప‌నిస‌రి చేసిన‌ట్లు కూడా విమాన‌యాన శాఖ వెల్ల‌డించింది. యూకేలో వ్యాప్తి చెందుతున్న కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. కొత్త రకం కరోనా వైరస్ 70 శాతం వేగంగా వ్యాపిస్తోందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. బ్రిటన్‌లో ప‌రిస్థితి చేయిదాటి పోయిందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రే స్వయంగా ప్రకటించారు. దీంతో యూరప్ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి.
Tags:    

Similar News