సింగపూర్ వెళ్లేందుకు ఆ సీఎంకు క్లియరెన్స్ ఇవ్వని కేంద్రం! మళ్లీ అదే తప్పా?

Update: 2022-07-19 09:30 GMT
కొన్ని తప్పుల్ని పొరపాటున కూడా చేయకూడదు. ఇలాంటి తప్పులు చేసిన నాటి కేంద్రం కారణంగా నరేంద్ర మోడీ ఇమేజ్ భారీగా పెరిగి.. ఆయన ప్రధాన మంత్రే అయ్యారు. ఏమిటిదంతా? గందరగోళంగా అనిపిస్తుందా? ఓకే.. మరింత వివరంగా చెబుతాం. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ వ్యవహరించే సమయంలో.. ఆయన్ను అమెరికాకు రావాలన్న ఆహ్వానాలు అందేవి. కానీ.. ఆయన అమెరికాకు వచ్చేందుకు అప్పటి అమెరికన్ ప్రభుత్వాలు సానుకూలంగా లేవన్న వార్తలు వచ్చేవి. అదే సమయంలో కేంద్రంలోని యూపీఏ సర్కారు సైతం సానుకూలంగా లేదన్న మాటలు వినిపించేవి. గుజరాత్ అల్లర్ల బూచిని చూపించి మోడీని అడ్డుకుంటున్నారని.. ఆయన అమెరికా పర్యటనను రార్ధాంతం చేయాల్సిన అవసరం ఉందా? అంటూ అప్పటి కేంద్రంలోని మన్మోహన్ సర్కారును.. అమెరికా ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టేవారు.

ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని అమెరికాకు రాకుండా అడ్డుకునే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు సరే.. రేపొద్దున ప్రధాని అయితే అప్పుడేం చేస్తారంటూ కొందరు ఆవేశంగా ప్రశ్నించే వారు కూడా. మోడీని ఎప్పటికప్పుడు పైకి రాకుండా ఉండేందుకు తొక్కేసేవారన్న ప్రచారం భారీగా సాగేది. ఇవన్నీ ఆయనపై పెద్ద ఎత్తున సానుభూతిని పెంచాయి. ఈ రోజున జాతీయ స్థాయిలో తిరుగులేని నేతగా మారటమే కాదు.. ఆయనకు ప్రత్యామ్నాయంగా ధీటైన ఒక్క నేతను చెప్పలేని పరిస్జితి. అంటే.. చేతిలో ఉన్న అధికారంతో తొక్కేసే ప్రయత్నం చేసే కొద్దీ.. వారికి మరింత సానుకూలతలు ఏర్పడతాయన్న నీతి ప్రధాని మోడీకి.. ఆయన పరివారానికి తెలియంది కాదు.

మరి.. అంత తెలిసిన తర్వాత కూడా మరో మోడీని తయారయ్యేలా మోడీ సర్కారు ఎందుకు తప్పు చేస్తుందన్నది అసలు ప్రశ్న. ఇదంతా ఎందుకంటే.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు సింగపూర్ నుంచి ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సింగపూర్ కు వెళ్లాలంటే ఆయనకు కేంద్రం నుంచి క్లియరెన్సు అవసరం. కానీ.. అది రాకపోవటంపై అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సింగపూర్ లో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని ఆహ్వానం అందగా.. దానికి హాజరయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. తనపై రాజకీయ కక్ష తో తనకు కేంద్రం క్లియరెన్సు ఇవ్వకపోవటాన్ని కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడుతున్నారు. ‘‘నేనేమీ క్రిమినల్ ను కాదు. ఈ దేశ పౌరుల చేత ఎన్నికైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని. నా సింగపూర్ పర్యటనకు క్లియరెన్సు ఇవ్వకపోవటం వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు కనిపిస్తోంది’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

గ్లోబల్ సమ్మిట్ లో ఢిల్లీ మోడల్ ను వివరించాలని సింగపూర్ ప్రభుత్వం తనకు ఆహ్వానం పంపినట్లుగా పేర్కొన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ‘‘నేను సమావేశాలకు వెళ్లకుండా ఎందుకు పరిమితులు విధిస్తున్నారో అర్థం కావటం లేదు. నా పర్యటనతో భారత్ కు మరింత కీర్తిని తెస్తుందనే భావిస్తున్నా. సమ్మిట్ కు ప్రపంచ వ్యాప్తంగా చాలామంది పెద్ద నాయకుల ముందు ఢిల్లీ మోడల్ ప్రదర్శిస్తే.. అది దేశానికి మంచిది. సింగపూర్ వెళ్లేందుకు వీలుగా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నా’’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసినట్లుగా చెబుతున్నారు.

ప్రపంచ వేదికల మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తాను అనుసరించిన విధానాల్ని చెప్పటం ద్వారా.. భారత్ లోని రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రీతిలో పని చేస్తున్నాయో అర్థమవుతుంది. మరి.. అలాంటి వాటికి ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు క్లియరెన్సు ఎందుకు ఇవ్వనట్లు? ఇలాంటివి కేంద్రానికి చెడ్డపేరును తీసుకొస్తాయని మోడీ సర్కార్ భావించటం లేదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
Tags:    

Similar News