హోం మంత్రి వ‌నిత ఇలాకాలో మారుతోన్న పొలిటిక‌ల్‌ సీన్‌... !

Update: 2023-03-12 13:00 GMT
ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో వైసీపీ రాజ‌కీయాల స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క‌మైన నాయ‌కుడుగా ఉన్న టీవీ రామారావు.. వైసీపీకి రాజీనామా చేశారు. నిజానికి ఎవ‌రు గెలిచినా.. ఎవరు ఓడినా..ఇక్క‌డ రామారావు హ‌వానే కొన‌సాగుతోంది. గెలిచిన నాయ‌కులు కూడా ఈయ‌న క‌నుస‌న్న‌ల్లోనే రాజ‌కీయాలు చేస్తార‌నే పేరుంది. అయితే.. ఇప్పుడు రామారావును అటు టీడీపీ నుంచి ఇటు వైసీపీ నుంచి కూడా దూరం చేసింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు టీడీపీలోనే ఉన్నా రామారావు.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో కేఎస్ జ‌వ‌హ‌ర్ విజ‌యానికి కృషి చేశారు. అయితే.. జ‌వ‌హ‌ర్ మంత్రి అయ్యాక‌.. రామారావుకు ఆయ‌న‌కు పొస‌గ‌లేదు. దీంతో విభేదాలు ర‌చ్చ‌కెక్కాయి. దీంతో జ‌వ‌హ‌ర్‌ను నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు పంపేవ‌ర‌కు నిద్ర పోయేది లేద‌ని ప్ర‌తిజ్ఞ చేసిన రామారావు.. అదే పంతం నెగ్గించుకున్నారు. ఇక‌, 2019లో త‌నే పోటీ చేయాల‌ని అనుకున్నారు.

కానీ, అనూహ్యంగా చంద్ర‌బాబు.. విశాఖ నుంచి వంగ‌ల‌పూడి అనిత‌ను తీసుకు వ‌చ్చి..ఇక్క‌డ పోటీకి దింపారు. దీంతో పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన రామారావు.. వైసీపీ త‌ర‌పున ప్ర‌చారం చేశారు. ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న తానేటి వ‌నిత విజ‌యంలో రామారావు కీల‌క పాత్ర పోషించారు. అయితే.. ఆ త‌ర్వాత‌.. గ‌తంలో ఉన్న ఆధిపత్య రాజ‌కీయాలే చోటు చేసుకున్నాయి. దీంతో కొన్నాళ్లుగా రామారావు వ‌ర్గానికి వ‌నిత వ‌ర్గానికి మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో దుమారం రేగుతోంది.

ఈ క్ర‌మంలో అధిష్టానం త‌న‌కు నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తుంద‌ని ఆశించినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు. దీంతో రామారావు చివ‌ర‌కు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే.. ఇప్పుడు ఎటు ఉంటార‌నేది ఆసక్తిగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌నే పైచేయి కావ‌డంతోవ‌చ్చే ఎన్నిక‌ల్లో రామారావు ఎటు వైపు ఉంటే ఆ పార్టీ గెలుస్తుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. దీంతో టీడీపీ ఆయ‌న‌ను అక్కున చేర్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News