హైదరాబాద్ ఇమేజ్ ను పీక్స్ కు తీసుకెళ్లే ప్రకటన చేసిన కేటీఆర్

Update: 2022-07-01 04:37 GMT
ఇటీవల కాలంలో హైదరాబాద్ కు వస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారు.. దూసుకెళుతున్న మహానగరాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ లో ఇలా జరుగుతుందన్న విషయాన్ని తాము నమ్మలేకపోతున్నట్లు పేర్కొంటున్నారు. శరవేగంతో దూసుకెళుతున్న హైదరాబాద్ మహానగరం మాదిరి.. దేశంలోని మరే నగరం లేదంటున్నారు. ఇదే.. పలు సంస్థలు హైదరాబాద్ కు రావటమే కాదు.. ఇక్కడి సానుకూలతలతో హైదరాబాద్ మీద ప్రేమాభిమానాల్ని ప్రదర్శించే వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

ఇటీవల కాలంలో దేశంలోని మరే మహానగరంలో జరగనన్ని హ్యాపెనింగ్స్ భాగ్యనగరిలో జరుగుతున్నాయని చెప్పక తప్పదు. ఇలాంటి వేళ.. వచ్చే ఏడాది జరిగే ఒక ఈవెంట్ కు సంబంధించిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశంలో మరే రాష్ట్రంలో ఇప్పటివరకు జరగని ఒక ఈవెంట్ కు హైదరాబాద్ వేదిక కానుంది. ఫార్ములా ఈ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరిగే ఫార్ములా ఈ రేసింగ్ (ఈ-ప్రిక్స్)కు హైదరాబాద్ మహానగరం అతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరిగే ఈ రేసింగ్ కు ఎఫ్ఐఏ వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ తాజాగా ఓకే చేసింది.

ఈ తరహా పోటీని ఇప్పటివరకు దేశంలోని మరే నగరంలోనూ నిర్వహించలేదు. ఈ ఘనత హైదరాబాద్ సొంతంగా చెప్పాలి. ఈ ఈవెంట్ జరిగే నాటికి.. అందుకు తగ్గట్లు రహదారిని సిద్ధం చేస్తామని చెబుతున్నారు. 2.37 కిలోమీటర్ల పొడవులో మొత్తం 8 మలుపులు.. సెక్టార్లుగా విభజించి.. నెక్లెస్ రోడ్డుపై రేసింగ్ ను నిర్వహించనున్నారు. సింగిల్ సీట్ ఎలక్ట్రిక్ వాహనాలతోఈ పోటీని నిర్వహించనున్నారు.

ఈ ఈవెంట్ తో ప్రపంచ మోటార్ స్పోర్ట్స్ లో హైదరాబాద్ కు స్థానం దక్కనుంది. ఈ ప్రిక్స్ ఛాంపియన్ షిప్ తొమ్మిదో సీజన్ లో భాగంగా వచ్చే ఏడాది జులై వరకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ మహానగరాల్లో 18 రేస్ లు నిర్వహించనన్నారు.

ఈ ఛాంపియన్ షిప్ మొదట్నించి మహీంద్రా రేసింగ్ ఇందులో భాగస్వామిగా ఉంటూ వస్తోంది. ఈ ఈవెంట్ ప్రత్యేకత ఏమంటే.. పెద్ద పెద్ద నగరాల్లోని వీధుల్లో జరగటమే. సాధారణంగా ఫార్ములా వన్ రేసులు మొత్తం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్క్యుట్లలో జరుగుతాయి. కానీ ఈ-ప్రిక్స్ రేసులు మాత్రం పెద్ద నగరాల్లోని వీధుల్లో జరుగుతాయి.

ఈ కార్యక్రమంలో మోటార్ స్పోర్ట్ మీద అవగాహన పెంచటంతో పాటు.. సరికొత్త వినోదాన్ని అందించినట్లు అవుతుంది. ఏమైనా.. దూసుకెళుతున్న హైదరాబాద్ నగరానికి ఈ ఈవెంట్ నిర్వహణతో మరింత ఇమేజ్ పెరగటం ఖాయమని చెప్పక తప్పదు. అదే సమయంలో దేశంలోని ఇతర రాష్ట్రాల వారు ఆసూయ పడటం ఖాయం.
Tags:    

Similar News