బండి చెప్పినట్లు గులాబీ తోటలో భారీ పేలుడుకు ఛాన్స్ ఉందా?

Update: 2021-01-21 10:11 GMT
కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే టీఆర్ఎస్ లో భారీ పేలుడు ఖాయమని.. ఆ మాటకు వస్తే అణుబాంబు కంటే తీవ్రత ఎక్కువగా ఉంటుందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేటీఆర్ ను సీఎంగా నియమిస్తే.. టీఆర్ఎస్ లో వ్యతిరేకత వస్తుందా? అన్న ప్రశ్న వేసుకుంటే నో అనే చెప్పాలి. బండి సంజయ్ మాటల్లో వాస్తవం కంటే అతిశయోక్తే ఎక్కువని చెప్పాలి.

ఎందుకంటే.. కేటీఆర్ ను సీఎం చేయాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. కొత్త విషయం అంతకన్నా కాదు. తనకు తన కుమారుడు కంటే మరెవరూ ముఖ్యం కాదన్న విషయాన్ని కేసీఆర్ ఇప్పటికే ఎన్నోసార్లు రుజువు చేశారు. ఒకప్పుడు కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ లో ఎవరి పాత్ర ఏమిటన్న విషయం మీద ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. పార్టీ నేతలంతా క్లారిటీ తెచ్చుకునేలా చేయటంతో పాటు.. అనుమానాలు ఉన్నాయనుకున్న పెద్దల్ని పక్కన పెట్టేయటాన్ని మర్చిపోకూడదు.

కేటీఆర్ కు.. హరీశ్ కు మధ్య అధిపత్య పోరు సాగే దశ నుంచి.. హరీశ్ అస్త్ర సన్యాసం చేసిన పరిస్థితి. పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యత ఎంతన్న విషయాన్ని తెలియజెప్పే క్రమంలో కొన్ని నెలల పాటు కేసీఆర్ సొంత పత్రిక నమస్తే తెలంగాణలో హరీశ్ ఫోటోను వేయటమే మానేశారు. అదొక్కటి చాలు.. పార్టీలో ఆయన స్థానం ఏమిటో చెప్పటానికి. ఈ తీరు సొంత పార్టీలో చాలామంది నేతలకు మనస్తాపం కలిగించినా.. కిమ్మనేందుకు సైతం సాహసించలేదు అని  ప్రచారం ఉంది .

అంతలా పార్టీ మీద అదుపు ఉన్నవేళ.. కేటీఆర్ ను సీఎం చేసినంతనే అణుబాంబు కంటే ఎక్కువ విస్పోటనం ఉంటుందని.. తీవ్రత ఎక్కువని చెప్పటం అతిశయోక్తే అవుతుంది తప్పించి మరొకటి కాదు. గులాబీ వర్గాల లోగుట్టు చర్చల్ని పరిశీలించినప్పుడు.. తనకు ఎంత అవమానాలు ఎదురైనా మాట మాట్లాడకుండా హరీశ్ ఉంటారని చెబుతున్నారు. మేనమామ మీద ఆయనకున్న ప్రేమాభిమానాలు అలాంటివన్న మాట వినిపిస్తోంది. ఒకప్పుడు పార్టీలో తనకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించే హరీశ్.. ఈ రోజున ఆయనకు చెందిన అత్యంత సన్నిహితులు ఎవరైనా పని అడిగితే.. నీకు తెలుసు కదా? నా తరఫు నుంచి రికమెండ్ చేస్తే జరిగే పని కూడా జరగదు.. ఫలానా మార్గంలోకి వెళ్లి పని పూర్తి చేసుకోండి..తర్వాత చూద్దామన్న మాటలన్నట్లుగా చెబుతారు అని  ప్రచారం ఉంది .

ఇదంతా చూసినప్పుడు కేటీఆర్ ను సీఎం చేసినంతనే ఏదో జరిగిపోతుందన్న బండి మాటల్లో అవగింజంత వాస్తవం కూడా ఉండదు. ఆ మాటకు వస్తే.. నిజానికి ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే.. కేసీఆర్ సీఎం అయిన వెంటనే తమ కుర్చీలకు ఎసరు పెడతారేమో? అని వణుకుతున్నారట. అందుకే.. కేటీఆర్ ను ప్రసన్నం చేసుకోవటానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.





Tags:    

Similar News