21 మంది ఎన్నారైల‌కు 20 ఏళ్ల జైలు శిక్ష‌!

Update: 2018-07-23 14:07 GMT
కాల్ సెంట‌ర్ల ముసుగులో అమెరిక‌న్ల‌కు కొంత‌మంది భార‌తీయులు కుచ్చు టోపీ పెట్టిన ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. భార‌త్ లో కాల్ సెంట‌ర్ల‌ను ఆప‌రేట్ చేస్తూ....ఇమ్మిగ్రేష‌న్ అధికార‌లమంటూ వంద‌ల కోట్ల డాల‌ర్ల‌ను కొల్ల‌గొట్టిన వైనం వెలుగులోకి వ‌చ్చింది. ఆ నేరగాళ్ల గుట్టుర‌ట్టు కావ‌డంతో నిందితుల‌కు జైలుశిక్ష‌ఖ‌రారైంది. ఈ కాల్ సెంట‌ర్ రాకెట్ లో సూత్రధారులైన 21 మంది భార‌త సంత‌తి వ్య‌క్తుల‌కు 20ఏళ్ల జైలుశిక్ష ఖ‌రారు చేస్తూ అమెరికాలోని కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. దోషులుగా నిర్ధార‌ణ అయిన 21 మందికి వారి వారి నేరాల తీవ్ర‌త‌ను బ‌ట్టి 4 నుంచి 20 ఏళ్ల‌ వరకు జైలుశిక్ష ప‌డింది. మరోవైపు, ఈ కాల్ సెంట‌ర్ స్కామ్ లో భాగ‌స్వాములైన 32 మంది భార‌తీయుల‌ను - 5 కాల్‌ సెంటర్లను కూడా కోర్టు దోషులుగా నిర్ధారించింది. త్వ‌ర‌లోనే ఆ 32 మందిని కోర్టు ముందు హాజరుపరుచాల్సి ఉంది.

అహ్మదాబాద్ కు చెందిన కొంద‌రు వ్య‌క్తులు నకిలీ కాల్‌ సెంటర్లు సృష్టించారు. 2012 నుంచి 2016 మధ్య కాలంలో తాము అమెరికన్ రెవెన్యూ అధికారులమ‌ని - ఇమ్మిగ్రేషన్ అధికారులమని చెప్పుకుంటూ...అమెరికాలోని వృద్ధులకు - కొంద‌రు వ్య‌క్తుల‌కు ఫోన్లు చేసేవారు. వారి స‌మాచారాన్ని ముందుగానే సేక‌రించేవారు. ఆ త‌ర్వాత వారు  ప్రభుత్వానికి భారీగా డబ్బు బాకీ ఉన్నారని, చెల్లించకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుంద‌ని బెదిరించేవారు. దీంతో, ఆ అమెరిక‌న్లు ఎంతో కొంత డబ్బు చెల్లించేవారు. వారు చెల్లించిన డ‌బ్బును అమెరికాలో అక్రమ నగదు లావాదేవీలు జరిపేవారికి అకౌంట్ల‌లో జ‌మ చేయించేవారు. ఆ త‌ర్వాత ఆ డ‌బ్బును వివిధ రూపాల్లో భారత్ కు పంపేలా అమెరికాలో కొంద‌రితో ఒప్పందాలు చేసుకునేవారు. ఈ ర‌కంగా  కొన్ని వందల కోట్ల డాలర్లను కొల్లగొట్టారు. వీరి గుట్టుర‌ట్టు కావ‌డంతో అంద‌రూ క‌ట‌క‌టాల‌పాల‌య్యారు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత వారిలో చాలామందిని భారత్ కు  పంపుతామని అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ చెప్పారు.
Tags:    

Similar News