బిల్లు కట్టలేదని 3 రోజులుగా శవాన్ని ఇవ్వని హైదరాబాద్ ఆసుపత్రి

Update: 2021-04-27 13:30 GMT
కరోనా వేళ.. కొన్ని ఆసుపత్రులు చేస్తున్న దారుణాలు వెలుగు చూస్తున్నాయి. విన్నంతనే షాకింగ్ గా మారిన ఈ ఉదంతాల్లో కొన్ని ఆరాచకానికి పరాకాష్ఠ అన్నట్లుగా ఉంటున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. బిల్లు కట్టలేదన్న కారణంగా చనిపోయిన మనిషి బాడీని ఇవ్వటానికి ససేమిరా అన్న వైనం షాకింగ్ గా మారింది.

ఎల్ బీ నగర్ లోని సుప్రజ ఆసుపత్రిలో ఈ నెల 18న కోవిడ్ లక్షణాలతో 41 ఏళ్ల డేనియల్ ప్రాంక్లిన్ జాయిన్ అయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇప్పటికే వైద్య చికిత్స కోసం అతడి కుటుంబ సభ్యులు రూ.1.40లక్షల బిల్లు కట్టారు. మరో ఆరు లక్షలు కడితే కానీ డెడ్ బాడీ ఇవ్వమని మొండికేసింది ఆసుపత్రి యాజమాన్యం. అయితే.. అంత డబ్బులు కట్టలేమని.. కాస్త తక్కువ చేయాలని కోరితే ససేమిరా అన్నది.

అంతేకాదు.. చనిపోయిన డెడ్ బాడీని ఆసుపత్రి సెల్లార్ లో ఉంచేసింది. మరణించి మూడు రోజులు అవుతున్నా.. మ్రతదేహాన్ని ఇచ్చేందుకు ఒప్పుకోని తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మ్రతుడి కుటుంబ సభ్యులు.. బంధువులు కలిసి ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టారు.

దీంతో.. ఆసుపత్రి ఆరాచకం వెలుగు చేసింది. ఈ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి.. ఆసుపత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే.. డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు ఇస్తామని చెప్పటంతో.. వివాదం ఒక కొలిక్కి వచ్చింది. డబ్బు యావ మంచిదే కానీ.. మరీ ఇంతలా అని.. విషయం తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు. 
Tags:    

Similar News