క‌రోనాపై గెలిచిన దేశం.. మాస్కులు విసిరికొట్టండని ప్ర‌భుత్వ‌ ప్ర‌క‌ట‌న‌!

Update: 2021-04-21 23:30 GMT
క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్ర‌పంచం మొత్తం వ‌ణికిపోతోంది. ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్లోనూ కొవిడ్ జాగ్రత్తలు మార్మోగుతున్నాయి. ''మాస్కులు వేసుకోండి.. భౌతిక దూరం పాటించండి.. శానిటైజర్ వాడండి'' అనే నినాదం విశ్వవ్యాప్తమైంది.

ఇక‌, ఇండియాలో ప‌రిస్థితి భ‌యాన‌కంగా మారిపోయింది. విజృంభిస్తున్న వైర‌స్ ధాటికి దేశం అల్ల‌క‌ల్లోల‌మ‌వుతోంది. ఆసుప‌త్రులు రోగుల‌తో నిండిపోతున్నాయి. బెడ్లు దొర‌క్క‌.. మందులు ల‌భించ‌క‌.. వ్యాక్సినేష‌న్ స‌రిగ్గా సాగ‌క‌.. నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు జ‌నం. ఇప్పుడు రికార్డు స్థాయిలో కేసులు న‌మోదువుతుండ‌గా.. ఆల్ టైం హైకి మ‌ర‌ణాలు చేరుతున్నాయి.

కానీ.. ఒక దేశం మాత్రం క‌రోనాను జ‌యించింది. త‌మ ద‌గ్గ‌ర్నుంచి త‌న్ని త‌రిమేసింది. ఇక‌, మాస్కులను అవ‌త‌ల విసిరికొట్ట‌మ‌ని ప్ర‌జ‌ల‌కు సూచించింది! అదే ఇజ్రాయిల్‌! అవును.. ఇజ్రాయిల్ త‌మ దేశ ప్ర‌జ‌ల‌ను ఫ్రీగా తిర‌గొచ్చ‌ని ప్ర‌క‌టించింది. దీనికి కార‌ణం.. ఆ దేశంలో క‌రోనా కేసులు అత్య‌ల్పంగా ఉండ‌డ‌మే.

ఆ దేశంలో దాదాపు 80 శాతం మందికిపై వ్యాక్సిన్ వేయించుకున్నారు. రెండు డోసుల‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసుకున్నారు. ప్ర‌స్తుతం కొత్త‌గా ఆ దేశంలో కేవ‌లం 7 కేసులు మాత్ర‌మే న‌మోదైన‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో.. జ‌నాలు మాస్కులు వేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

అయితే.. ఆ దేశ జ‌నాభా సుమారు కోటి మాత్ర‌మే. దాదాపు 8 ల‌క్ష‌ల మందికి వైర‌స్ సోక‌గా.. 6 వేల మంది మ‌ర‌ణించారు. దీంతో.. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ‌గా నిలిచింది. ఎటువంటి రాజ‌కీయాలు చేయ‌కుండా.. వారిని ఆదుకునేందుకు చిత్త‌శుద్ధితో ప్ర‌య‌త్నించింది. అంద‌రికీ వ్యాక్సిన్ అందించింది. క‌రోనాపై విజ‌యం సాధించింది. మ‌న దేశంలో ఈ ప‌రిస్థితి ఎప్పుడు వ‌స్తోంది? క‌రోనా పీడ ఎప్పుడు విర‌గ‌డ అవుతుందో?
Tags:    

Similar News