కేసీఆర్ క‌ళ్ల‌ల్లో ఆనందం కోసం బంధువుల‌ను వాడుకుంటున్న ఓ మంత్రి

Update: 2021-07-25 11:30 GMT
తెలంగాణ‌లో రాజ‌కీయాల‌పై ఆస‌క్తి ఉన్న వారంద‌రి క‌ళ్లు ఇప్పుడు హుజురాబ‌ద్ పై ప‌డిన సంగ‌తి తెలిసిందే. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామాతో ఇక్క‌డ జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నిక‌కు ఇంకా నోటిఫికేష‌న్ షెడ్యూల్ విడుద‌ల కాక‌పోయిన‌ప్ప‌టికీ ఇందుకు అన్ని పార్టీలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ , ప్ర‌తిప‌క్ష బీజేపీ వ్యూహాత్మ‌కంగా సిద్ధ‌మ‌వుతున్నాయి. అయితే, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఓట‌మికి టీఆర్ఎస్ అన్ని అస్త్రాల‌ను వాడుతోంద‌ని స‌మాచారం. ఓ మంత్రి అయితే, ఏకంగా బంధువుల విష‌యంలోనూ ఈ ఎన్నిక‌ విష‌యంలోనే డీల్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన హుజురాబాద్ పాలిటిక్స్‌లో సమీకరణాలు కూడా స్పీడ్‌గా మారిపోతున్నాయి. ద్వితీయ శ్రేణి నాయకులు కండువాలు మార్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. తాజాగా ఈటల వెన్నంటే ఉంటున్న మరో ముఖ్య నాయకుడు ఈ రోజు తెరమరుగు కావడం హుజురాబాద్‌లో చర్చకు దారి తీసింది. శుక్రవారం రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ప‌ర్య‌ట‌న‌ సందర్భంగా జమ్మికుంట మునిసిపల్ వైస్ ఛైర్ పర్సన్ దేశిని స్వప్న, కోటి ఇంటికి స్వయంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెళ్లి కలిశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరి కుటుంబానికి, దేశిని కోటి సోదరి కుటుంబానికి మధ్య వియ్యం ఉండడంతో ఆ బంధుత్వం వల్లే మంత్రి వెళ్లారని చెప్తున్నారు. కోటి ఇంటికి వెళ్లిన సమయంలో మీడియాను అనుమతించలేదు. ఫోటోలు, వీడియోలు కూడా తీయకుండా నిలువరించారు. కోటి మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనుచరునిగా ఉండడంతో పాటు తాము ఆయనకే మద్దతు ఇస్తామని కూడా ప్రకటించారు. దీంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంత్రాంగం చేసి కోటిని టీఆర్‌ఎస్‌లోకి తిరిగి వచ్చేలా ఒప్పించే ప్రయత్నం చేశారట‌


మున్సిప‌ల్ వైస్‌ చైర్మ‌న్ ఇంటికి వెళ్లిన సంద‌ర్భంగా మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసిన‌ట్లు స‌మాచారం. ‘ముఖ్యమంత్రి కూడా నీ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి ఒప్పించి మెప్పించాలని ఆదేశించారు. అందుకే నీ ఇంటికి నేనే స్వయంగా వచ్చా’ అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. ‘నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు అంతా కూడా పార్టీలోనే ఉంటున్నారు. నువ్వోక్కడివే ఈటల వెంట ఉండడం సరికాదు.. భవిష్యత్తు కోసమైనా టీఆర్ఎస్‌లో చేరండి’ అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోటి దంపతుల ముందు ప్రతిపాదన పెట్టినట్టు చెప్తున్నారు. అయితే తాము ఈటలకు మాట ఇచ్చామని, ఆయన వెంటే ఉంటామని కోటి దంపతులు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో సుతి మెత్తగా చెప్పి తప్పించుకున్నారని సమాచారం. దీంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ‘మరోసారి ఆలోచించుకో నా బంధువుగా నీకు చెప్తున్నాను’ అని చెప్పి వెల్లిపోయారని తెలుస్తోంది. అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ దేశిని కోటి కుటుంబ సభ్యులను కలిసి వెల్లిపోయిన తరువాత టీఆర్‌ఎస్ పార్టీలో తిరిగి చేరుతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కోటీ శుక్రవారం సాయంత్రం ఈటల పాదయాత్రలో కనిపించడంతో ఈటలతోనే ఉంటున్నాడన్న నమ్మకం అందరిలో కలిగింది. కానీ అనూహ్యంగా శనివారం ఉదయం కోటి ఈటల పాదయాత్రలో కనిపించడకపోవడం మళ్లీ చర్చకు తెరలేపింది. మొత్తంగా హుజురాబాద్ రాజ‌కీయం బంధుత్వాల‌ను సైతం వినియోగించుకునే స్థితికి చేరింద‌ని చెప్తున్నారు.


Tags:    

Similar News