నిర్భయకు ట్రీట్ మెంట్ ఇచ్చిన డాక్టర్ తాజాగా ఏం చెప్పారు?

Update: 2020-03-21 09:20 GMT
దగ్గర దగ్గర ఎనిమిదేళ్ల తర్వాత నిర్భయ దోషులకు ఉరి పడింది. ఈ దారుణమైన నేరానికి పాల్పడిన వారిలో ఒకడు మైనర్ కావటం.. మూడేళ్ల జైలుశిక్ష అనుభవించి.. దక్షిణాది రాష్ట్రాల్లో వంటవాడిగా బతికేస్తున్నాడు. ఉరి శిక్ష అమలు వేళ.. నిర్భయకు చికిత్స చేసిన వైద్యుడు మాట్లాడారు. నిర్భయ తమ ఆసుపత్రికి వచ్చే వేళకు ఆమె పరిస్థితి ఎలా ఉందో చెప్పటమే కాదు.. ఆమె ఎంతటి నరకయాతన అనుభవించిందో చెప్పుకొచ్చారు.

నిర్భయను అంత అమానమీయంగా ఎందుకు హింసించారంటూ దోషుల్ని తాను అడిగినప్పుడు వారేం చెప్పారో కూడా ఆయనీ సందర్భంగా వెల్లడించారు. అంతేకాదు.. నిర్భయ దోషుల మెడకు ఉరి ఎలా బిగుసుకుంది? అందుకు సాయం చేసిన మెడికల్ రిపోర్టులు ఏమిటో చెప్పుకొచ్చారు ఆమెకు చికిత్స చేసిన డాక్టర్ సునీల్ జైన్. 2012 డిసెంబరు 16న ఏంజరిగంది? తర్వాతేమైందన్న విషయాల్ని ఆయన మాటల్లోనే చెబితే..

ఆ రోజు రాత్రి ఒంటి నిండా గాయాలతో.. రక్తంతో తడిచి ఉన్న నిర్భయను మా ఆసుపత్రికి (సఫ్దర్ జంగ్ ఆసుపత్రి) తీసుకొచ్చారు. పరిస్థితి చూడగానే మాకు అర్థమైంది. ఓరకంగా ఆమెను అక్కడకు తీసుకొచ్చేసరికే చనిపోయినంత స్థితిలో ఉంది. ఆమెకు చికిత్స చేస్తున్నంతసేపు మేం బాధతో విలవిల్లాడిపోయాం. ఆమె పేగుల్లోకి రెంచ్ పెట్టి పొడిచేశారు. పొత్తికడుపు చిద్రం చేశారు. ఆమెను తీసుకొచ్చిన రోజే ఆమె బతకదని మాకు అర్థమైంది.

పేగు మార్పిడి జరిపితే తప్పించి ఆమె బతకదు. ఇప్పటికి ఇంటెస్టీనియల్ ట్రాన్స్ ప్లాంటేషన్ ప్రపంచంలో అధ్యయన దశలోనే ఉంది. ప్రయోగాలుజరుగుతున్నాయి. ఫలితం ఇంకా రాలేదు. ఏదైనా ప్రయోజనం ఉంటుందని సింగపూర్ లోని ఆసుపత్రికి తరలించాం. కానీ.. ప్రయోజనం లేకపోయింది. ఈ ఉదంతం తర్వాత నేను దోషుల్లో ఒకడితో మాట్లాడా.
ఎందుకంత క్రూరంగా వ్యవహరించారు? ఎందుకంత దారుణంగా హింసించారు? అని అడిగాను. తమ ప్రయత్నాల్ని ఆమె ప్రతిఘటించిందని.. అందుకే పొడిచేశామని చెప్పాడు. మా ఆసుపత్రితో పాటు.. సింగపూర్ ఆసుపత్రుల వైద్యులు ఇచ్చిన నివేదికే ప్రాసిక్యూషన్ కు ప్రధాన ఆధారమైంది. అంతటి క్రౌర్యమే దోషులకు ఉరి పడేలా చేసింది.


Tags:    

Similar News