అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం ఓ కుట్ర : కేంద్రమంత్రి

Update: 2021-04-05 13:30 GMT
కేరళలో రేపు ఉదయం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా తమ ప్రచారాన్ని పూర్తి చేసి , ఓటర్ల తీర్పు కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కీలక  వ్యాఖ్యలు చేశారు. శబరిమలైలో మహిళల ప్రవేశానికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాయి. వామపక్ష ప్రభుత్వం శబరిమలై ఆలయంలోకి మహిళలను దొంగతనంగా పంపించిందని నిర్మల సంచలన ఆరోపణలు చేశారు. అయ్యప్ప భక్తుల కానివారిని ఆలయంలోకి పంపించి, అక్కడ లాల్ ‌సలాం చెప్పించేందుకు కుట్రపూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు.   అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పును అమలు చేస్తామంటూ వామపక్ష ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని నిర్మలమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆలయ సంప్రదాయాలను తుంగలో తొక్కొద్దని అయ్యప్ప భక్తులు, బీజేపీ, పలు హిందూ సంఘాలు, ఆందోళన చేసినప్పటికీ పోలీసులను ఉసిగొల్పి నలభై ఏళ్ల మహిళలను ఆలయ దర్శనానికి అనుమతి ఇచ్చింది అని అన్నారు. భక్తులు ఆందోళన చేస్తున్నా పోలీసు పహారా నడుమ మహిళలను అయ్యప్ప దర్శనం చేయించిందని తెలిపారు.  అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించడం.. భక్తులపైకి పోలీసులను పంపించడం ద్వారా మంత్రి కడకంపల్లి సురేంద్రన్ ఘోర పాపం చేశారని.. 500 ఏళ్లు తపస్సు చేసినా ఆయన పశ్చాత్తాపం పొందలేరని ఆమె అన్నారు. అంతే కాకుండా గత యూడీఎఫ్, ప్రస్తుత ఎల్డీఎఫ్ ప్రభుత్వాలు అవినీతిలోనూ పోటీపడుతున్నాయని ఆమె విమర్శించారు. గోల్డ్ స్కామ్, విదేశీ కరెన్సీ స్కామ్, సోలార్ స్కామ్ ‌లతో ఇద్దరూ పోటీ పడుతున్నారని ఆమె అన్నారు. కేరళ ప్రజల సంక్షేమం పాలకులకు పట్టడం లేదని.. జేబులు నింపుకోవడమే పనిగా పెట్టుకున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఎల్డీఎఫ్ అవినీతిపై ప్రశ్నిస్తే తమ సోలార్ స్కామ్ గురించి బయటపెడతారేమోనని కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ నోరుమెదపడంలేదని విమర్శించారు.
Tags:    

Similar News