భార‌త్ లో తొలి క‌రోనా కేసు..!

Update: 2021-01-30 17:30 GMT
భార‌త్ లో క‌రోనా ఇవాళే వెలుగు చూసింది..! అవును.. ఈరోజే! కానీ, సంవ‌త్సరం మాత్రం 2020! మ‌న దేశంలో క‌రోనా తొలి కేసు వెలుగు చూసి స‌రిగ్గా నేటికి ఏడాది. ప్ర‌స్తుతం మ‌న దేశంలో న‌మోదైన మొత్తం కోరోనా కేసుల సంఖ్య‌ ఒక కోటీ 7 ల‌క్ష‌ల 20 వేల 48. ఒక ల‌క్ష 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కాలంలో దేశం ఎదుర్కొన్న అవ‌స్థ‌లు అన్నీ ఇన్నీ కావు. ప్ర‌జ‌లు అనుభ‌వించిన ఇబ్బందులకు లెక్కా ప‌త్రం లేదు.

అప్ప‌టికే చైనాను కుదిపేస్తున్న కొవిడ్ -19 వైర‌స్‌.. మ‌న‌ దేశంలోకి కూడా ప్ర‌వేశించింది. ఈ విష‌యం 2020 జ‌న‌వ‌రి 30న వెల్ల‌డైంది. చైనాలోని వుహాన్ నుంచి వ‌చ్చిన కేర‌ళ విద్యార్థి మొద‌ట‌గా క‌రోనా బారిన ప‌డ్డాడు. వుహాన్‌లో మెడిసిన్ చదువుతున్న త్రిసూర్ కు చెందిన 20ఏళ్ల విద్యార్థి ఇదే రోజున తిరిగి ఇంటికి వచ్చాడు. అనారోగ్యంగా ఉన్న స‌ద‌రు విద్యార్థిని ప‌రీక్షించ‌డంతో వైర‌స్ బ‌య‌ట‌ప‌డింది. ఆ తర్వాత మ‌రో నాలుగు రోజుల్లో కేరళలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయయ్యాయి. వీరిద్ద‌రు కూడా చైనాలో చదువుతున్నవారే. ఇలా క్ర‌మ‌క్ర‌మంగా దేశంలో కేసులు పెర‌గ‌డం మొద‌లైంది.

ఇక‌, తొలి మ‌ర‌ణం మ‌న హైద‌రాబాద్ లోనే న‌మోదైంది. చ‌నిపోయిన వ్య‌క్తి మాత్రం కర్నాటకలోని కల్బుర్గీకి చెందిన 76ఏళ్ల వృద్ధుడు. హైద‌రాబాద్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆ విధంగా దేశంలో తొలి క‌రోనా మ‌ర‌ణం మార్చి 12న నమోదైంది. ఈ విధంగా శ‌ర‌వేగంగా దేశంలో క‌రోనా కేసులు పెర‌గ‌డం మొద‌ల‌య్యాయి. ఒక‌ రోజుకు న‌మోద‌య్యే కేసుల సంఖ్య‌.. వంద‌లు దాటి, వేలు దాటి ల‌క్ష ద‌గ్గ‌ర‌కు కూడా వెళ్లింది. దేశంలో అత్య‌ధిక కేసులు సెప్టెంబర్ 16న న‌మోద‌య్య‌యి. ఈ రోజున‌ దేశవ్యాప్తంగా 97,894 కేసులు నమోదయ్యాయి. ఇక మ‌ర‌ణాలు కూడా విప‌రీతంగా పెర‌గ‌డం మొద‌లైంది.

ఒక‌ట్లు దాటి, ప‌దులు దాటి వంద‌ల‌కు చేరిన క‌రోనా మ‌ర‌ణాలు.. వేల‌ల్లోకి కూడా చేరిపోయాయి. దేశంలో ఒక్క రోజు క‌రోనా మ‌ర‌ణాలు అత్య‌ధికంగా 1,290 న‌మోద‌య్యాయి. గ‌తేడాది సెప్టెంబర్ 15న ఈ గ‌ణాంకాలు న‌మోద‌య్యాయి. దీంతో.. క‌రోనా పేరు చెబితేనే జ‌నం గుండెల్లో ద‌డ మొద‌లైంది. ఎవ‌రినైనా ట‌చ్ చేయ‌డం సంగ‌తి అటుంచితే.. క‌నీసం ఎదురు ప‌డ‌డానికి కూడా భ‌య‌ప‌డిపోయారు.

అయితే.. దేశంలో క‌రోనాను ముంద‌స్తుగా అడ్డుకోవ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం చాలా ప్ర‌య‌త్నాలు చేప‌ట్టింది. చివ‌రి మార్గంగా లాక్ డౌన్ విధించింది. మార్చి 24న దేశానికి తాళాలు ప‌డ్డాయి. దీంతో యావ‌త్ దేశం ఇంట్లోనే ఉండిపోయిన సంద‌ర్భ‌మది. ఆ త‌ర్వాత కంటిన్యూ చేశారు. ఫ‌లితంగా అత్య‌వ‌స‌ర‌మైన ఒక‌టీ రెండు శాతం మంది త‌ప్ప‌, ద‌దాపు దేశం మొత్తం నాలుగు గోడ‌ల‌కే ప‌రిమిత‌మైపోయింది. ఈ ప‌రిస్థితి చాలా కాలం కొన‌సాగింది.

అయితే.. మార్చి 25 నుంచి లాక్‌డౌన్ కొన‌సాగింది. ప్ర‌పంచంలో లాక్ డౌన్ విధించిన తొలి దేశం భార‌త్ మాత్ర‌మే. ఇది చాలా తెలివైన పని అని నిపుణులు ఆ త‌ర్వాత గుర్తించారు. అమెరికా స‌హా ఇత‌ర యూరోపియ‌న్ దేశాల్లో ల‌క్ష‌లాది కేసులు న‌మోద‌వుతున్న త‌రుణంలోనూ ఇండియాలో వేల‌ల్లోనే కేసులు న‌మోద‌య్యాయి. ఆ త‌ర్వాత భార‌త్ లోనూ కేసుల న‌మోదు అత్యంత తీవ్ర‌రూపం దాల్చింది.

చాలా మందికి తెలియ‌దుగానీ.. ఇప్ప‌టికీ మ‌న దేశంలో లాక్ డౌన్ కొన‌సాగుతూనే ఉంది! అవును.. లాక్ డౌన్ అమ‌ల్లోనే ఉంది. ప్ర‌భుత్వం విడ‌త‌ల వారీగా నిబంధ‌న‌లు స‌డ‌లిస్తూ వ‌చ్చింది. వారం క్రితం కూడా మ‌రికొన్ని నిబంధ‌న‌లు స‌డ‌లించింది. అయితే.. జ‌నాలు స్వేచ్ఛ‌గా త‌మ ప‌నులు తాము చేసుకునే ప‌రిస్థితి రావ‌డంతో.. లాక్ డౌన్ రూల్స్ ను గుర్తుపెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది.

అయితే.. ఈ లాక్ డౌన్ సృష్టించిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. చాలా మంది అమాయ‌కుల‌ ప్రాణాల‌ను బ‌లిగొన్న‌ది. దేశంలో ఎక్క‌డెక్క‌డో ప‌నుల‌కు వెళ్లిన‌వారు త‌మ సొంత ప్రాంతాల‌కు వెళ్ల‌లేక తీవ్ర క‌ష్టాల‌ను అనుభ‌వించారు. ర‌వాణా మొత్తం స్తంభించ‌డంతో.. వంద‌లాది మైళ్లు కాలిన‌డ‌క‌నే వెళ్లిన‌వారు ఉన్నారు. అంత దూరం న‌డ‌వ‌లేక ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇక‌, చేయ‌డానికి ప‌నిలేక‌.. తిన‌డానికి తిండిలేక ప‌స్తులున్న‌వారికి లెక్కేలేదు. అత్య‌వ‌స‌ర వైద్యానికి కూడా నోచుకోక ప్రాణాలు విడిచిన అభాగ్యులు ఎంద‌రో!

ఇలాంటి దుర్భ‌ర ప‌రిస్థితుల్లో మొద‌లైన వ్యాక్సిన్ ప‌రిశోధ‌న‌లు కొలిక్కి రావ‌డానికి ఏడాది కాలం ప‌ట్టింది. అవ‌కాశం ఉన్న దేశాల‌న్నీ వ్యాక్సిన్ త‌యారీకి న‌డుం బిగించాయి. మ‌న దేశంలోనూ భార‌త్ భ‌యోటెక్‌, సీరం ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ త‌యారు చేశాయి. అన్ని ప‌రిశోధ‌న‌లూ, అవాంత‌రాలూ పూర్తిచేసుకొని వ్యాక్సిన్ సిద్ధం కాగా.. ప‌రిశీలించిన ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది. దాని ప్ర‌కారం.. జనవరి 16, 2021న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.

మొత్తానికి వ్యాక్సిన్ వ‌చ్చేసిన‌ప్ప‌టికీ.. క‌రోనా ఉప‌ద్ర‌వం మాత్రం ఇంకా పూర్తిగా తొల‌గిపోలేదు. కంటికి క‌నిపించ‌ని ఈ వైర‌స్ తో ప్ర‌పంచం మొత్తం బ‌య‌ట‌కు క‌నిపించే యుద్ధం చేసింది. ఈ స‌మ‌రం ఎన్నో ఇబ్బందులు సృష్టించింది.. మ‌రెన్నో స‌వాళ్ల‌ను ముందుకు తెచ్చింది.. ప్ర‌కృతిని ఎంత‌గా ధ్వంసం చేస్తే.. అంత‌గా ప్ర‌తి విధ్వంసం ఉంటుంద‌ని గుణ‌పాఠం చెప్పింది. మ‌రి, మ‌నిషి ఇక‌నైనా మేల్కొంటాడో..?!
Tags:    

Similar News