పోయి.. పోయి జైశంకర్ ను కదిపాడు.. ఊరుకుంటాడా?

Update: 2023-03-02 08:20 GMT
అగ్ర రాజ్యానికి ఉండే బలుపు.. సంపన్న దేశాలకు ఉండే అహంకారం అంతా ఇంతా కాదు. వారి ప్రయోజనాల కోసం ప్రపంచాన్ని ఇరుకున పడేసేందుకు అస్సలు వెనుకాడని వీరు..కొన్ని దేశాలు తీసుకున్న నిర్ణయాల్ని మాత్రం ప్రశ్నిస్తూ ఉంటారు. అదే సమయంలో.. వారు తీసుకునే చెత్త నిర్ణయాలను వారి వద్ద ప్రశ్నించే వీలు ఉండదు. వారు మాత్రం.. తమకు కించిత్ సమస్య వచ్చినా.. వెంటనే విరుచుకుపడిపోవటం.. బాహాటంగా అభ్యంతరాల్ని వ్యక్తం చేయటం లాంటివి చేస్తుంటారు.

అన్ని రోజులు ఒకటిలా ఉండవన్నట్లుగా ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆ తీరును ప్రదర్శిస్తోంది. అగ్ర రాజ్యాలు.. సంపన్న దేశాలు తెలిపే అభ్యంతరాలకు ధీటుగా సమాధానం ఇస్తోంది. గతంలో ఇలాంటి విషయాల్లో తెలియని సంకోచం.. వారి మాటలకు ఊ కొట్టేయటం లాంటివి చేసే తీరుకు భిన్నంగా.. మాటకు మాట చెప్పే ధైర్య సాహసాల్ని ప్రదర్శిస్తోంది భారత్. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది.

ఈ మధ్య కాలంలో దేశీయ విదేశాంగ మంత్రులుగా వ్యవహరించిన వారిలో ఇప్పుడు ఆ బాధ్యతల్ని నిర్వహిస్తున్న జై శంకర్ మించిన ఫైర్ బ్రాండ్ నేత మరొకరు ఉండరనే చెప్పాలి. ఆ మధ్యన పశ్చిమ దేశాల పెట్రోల్.. డీజిల్ వినియోగం గురించి ఒక్క మాటలో చెప్పేయటం ద్వారా.. మళ్లీ వారు నోరెత్తకుండా చేసిన ఆయన ఈసారి బ్రిటన్ విదేశాంగ మంత్రి విషయంలోనూ అలాంటి తీరునే ప్రదర్శించటం గమనార్హం.

ఇటీవల ఢిల్లీ.. ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ సర్వే నిర్వహించిన వైనం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఇదే విషయాన్ని భారత్ వద్ద బ్రిటన్ లేవనెత్తింది. దీనికి మన విదేశాంగ మంత్రి కచ్ఛితమైన వైఖరిని ప్రదర్శించటంతో పాటు.. తేల్చి చెప్పటం ద్వారా తన నిర్ణయాల్ని వేలెత్తి చూపించే పని చేయొద్దన్న వైనాన్ని నిష్కర్షగా చెప్పేయటం గమనార్హం.

జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం తాజాగా జరిగింది. ఈ సందర్భంగా భేటీ అయిన బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ - భారత విదేశాంగ మంత్రి జైశంకర్ లు భేటీ అయిన వేళ.. బీబీసీ ప్రస్తావన తీసుకొచ్చింది. దీనికి అంతే సూటిగా స్పందించిన జైశంకర్.. "భారత్ లో పనిచేసే అన్ని సంస్థలు మా చట్టాలు.. నిబంధనల్ని తప్పక పాటించాలి" అంటూ స్పష్టం చేయటం గమనార్హం.  2002లో గుజరాత్ లో చోటు చేసుకున్న అల్లర్లపై బీబీసీ ఒక డాక్యుమెంటరీ తీయటం.. అందులో మోడీని కార్నర్ చేసిన వైనంపై కేంద్రం  కన్నెర్ర చేసింది.

ఈ డాక్యుమెంటరీని బ్యాన్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆ సంస్థ ప్రధాన కార్యాలయాల్లో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహించింది. దాదాపుగా 59 గంటల పాటు నిర్వహించిన సర్వే చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వేళ.. భారత విదేశాంగ మంత్రి తీరు గురించి మాట్లాడుకోవాల్సిందే. గతంలో ఇలాంటి వ్యవహారమే చోటు చేసుకుంటే.. నీళ్లు నమలటం తప్పించి..నిలదీసినట్లుగా మాట్లాడే విషయంలో వెనుకబడి ఉండేవారు. కానీ.. ఇప్పుడా లోటు జైశంకర్ కారణంగా తప్పిందని చెప్పాలి. ఇందుకు బలమైన మోడీ సర్కారేనని చెప్పక తప్పదు. అయినా.. పోయిపోయి జైశంకర్ తో పెట్టుకోవటమా?

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News