ఊపందుకుంటున్న ది గ్రేట్ రిజిగ్నేషన్

Update: 2021-10-15 13:30 GMT
కోవిడ్ అనంతర పరిణామాలతో అమెరికా, యూరోపు దేశాలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది. కరోనా వైరస్ కారణంగా లక్షలాది సంస్ధలు మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇపుడిప్పుడు కరోనా మహమ్మారి ప్రభావం సర్దుబాటు అవుతున్న నేపధ్యంలో మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి సంస్ధలు. అయితే హఠాత్తుగా అనేక సంస్ధల్లోని వేలాదిమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసేస్తున్నారు.

అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, బ్రిటన్ దేశాల్లో రాజీనామాల పర్వం ఊపందుకుంటోంది. కరోనా కారణంగా కంపెనీలు మూతపడకున్నా ఉద్యోగాలు తీసేయకున్నా చాలా దేశాల్లో వేతనాలైతే బాగా తగ్గిపోయాయట. ఇదే సమయంలో ఇపుడు కొత్తగా ప్రారంభిస్తున్న కంపెనీలు కొత్తగా ఉద్యోగులను తీసుకుంటు ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఇస్తున్నట్లు ప్రకటనలిస్తున్నాయి. అయితే కంపెనీలు ఇస్తున్న ప్రకటనలకు యువతపై పెద్దగా ప్రభావం చూపటంలేదని అంచనా.

ఆకర్షణీయమైన ప్యాకేజీల వైపు యువత చూడకపోవటం ఒక ఎత్తయితే ఉన్న వాళ్ళు కూడా తమ ఉద్యోగాలను వదిలేస్తున్నారట. హఠాత్తుగా ఉద్యోగాలు కోల్పోవటం లేదా తక్కువ వేతనాలకు పనిచేయటం కన్నా కొత్త ఆదాయ మార్గాలను సొంతంగా వెతుక్కోవటమే మేలని మెజారిటి ఉద్యోగులు భావిస్తున్నారట. దీన్నే ది గ్రేట్ రిజగ్నేన్ అంటున్నారు. ఒక్క అమెరికాలోనే మొన్నటి ఆగష్టులో 43 లక్షల మంది తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారట.

ఉద్యోగాలు వదిలేసి తమలోని సృజనాత్మకతకు పెద్దపీట వేయటానికే యువత ప్రాధాన్యత ఇస్తున్నారట. తమ సొంత ఆదాయమార్గంలో తక్కువ ఆదాయమే వస్తున్నా పర్వాలేదని సర్దుకుంటున్నారట. ఎందుకంటే ఎలాంటి సంక్షోభం వచ్చినా ఇక తమ ఉద్యోగాలు పోయేది లేదు సరికదా కొత్త ఆదాయమార్గం పూర్తిగా తమ సొంతం కాబట్టి ఉన్నదాంట్లోనే హ్యాపీగా ఉంటున్నట్లు యువత చెబుతున్నారట. తాజాగా ఊపందుకున్న ది గ్రేట్ రిజిగ్నేషన్ ఉద్యమం టూరిజం, హెల్త్, హాస్పిటాలిటీ, రీటైల్, రెస్టారెంట్ రంగాల్లో ఎక్కువగా కనిపిస్తోందట.

ఉద్యోగుల్లో కొత్తగా మొదలైన ఇలాంటి ధోరణిని ఎదుర్కోవటానికి కంపెనీల యాజమాన్యాలు, వ్యాపారులు నానా అవస్తలు పడుతున్నారట. బార్లు, రెస్టారెంట్లలో పనిచేసే వారికి గంటకు 15 డాలర్టు ఇస్తున్నారట. గంటకు 15 డాలర్లంటే చాలా చాలా ఎక్కువేనట. అయినా యువత 15 డాలర్లకు పెద్దగా ఆశపడటంలేదట. ఒకళ్ళ దగ్గర పనిచేసి గంటకు 15 డాలర్లు సంపాదించుకోవటం కన్నా తామే సొంతంగా ఏదైనా చేసి అంతకన్నా తక్కువ సంపాదించుకోవటానికే ఇష్టపడుతున్నారట. మరి తాజాగా మొదలైన ది గ్రేట్ రిజిగ్నేషన్ ఉద్యయం ఎక్కడికి తీసుకెళుతుందో చూడాల్సిందే.


Tags:    

Similar News