మాచర్ల, పుంగనూరు ఏకగ్రీవాలపై హైకోర్టు కీలక నిర్ణయం

Update: 2021-02-12 15:38 GMT
ఏపీలో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. సీఎం జగన్ పిలుపుతో గ్రామాలకు గ్రామాలు ఏకగ్రీవాలు చేస్తూ ప్రభుత్వం ప్రకటించిన భారీ నజరానాను పొందాలని ఆరాటపడుతున్నాయి. మొదటి విడత కంటే కూడా రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో జోరుగా ఏకగ్రీవాలు జరిగాయి. ఇక వీటిని వైసీపీ నేతలు చేస్తున్న బలవంతపు ఏకగ్రీవాలని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

తాజాగా  అమరావతి పరిధిలోని  మాచర్ల నియోజకవర్గంలోని 77 గ్రామాలకు గాను 73 చోట్ల ఏకగ్రీవం కావడం సంచలనమైంది.. రాష్ట్రంలోనే అత్యధికంగా ఏకగ్రీవాలైన నియోజకవర్గంగా మాచర్ల ముందంజలో ఉంది.  గతంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ మాచర్లలోని అన్ని స్థానాల్లో వైసీపీ ఏకగ్రీవంగా గెలిచింది. దీంతో దీనిపై అందరిలోనూ అనుమానాలు కలిగాయి. అసలే ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తూ హోల్డ్ లో పెడుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఈ భారీ ఏక్రగీవాలపై నజర్ పెట్టారు.

ఇక చిత్తూరు జిల్లాలోనూ ఏకగ్రీవాల జాతర కొనసాగింది. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులో రెండు పంచాయతీలు మినహా అన్నీ ఏకగ్రీవం కావడం విశేషం. ఇందులో పెద్దిరెడ్డి స్వస్థలం సదుంలో 18 పంచాయతీలు, 172 వార్డులను ఏకగ్రీవమయ్యాయి. పుంగనూరు మండలంలో 23, చౌడేపల్లి మండలంలో 17 ఏకగ్రీవమయ్యాయి.

అయితే ఇవన్నీ వైసీపీ చేస్తున్న బలవంతపు ఏకగ్రీవాలని టీడీపీ నేతలు ఆరోపించారు. దీనిపై హైకోర్టుకు ఎక్కారు. ఈ క్రమంలోనే పుంగనూరు, మాచర్లలో    బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు ఎస్‌ఈసీ పరిగణలోకి తీసుకుని ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. దీతో ఆ రెండు నియోజకవర్గాల ఏకగ్రీవాలపై నీలినీడలు కమ్ముకున్నాయి.
Tags:    

Similar News