భైంసాలో పోలీసుల తీరు.. 'ది కేరళ స్టోరీ' ఇష్యూ రగులుకుంటోంది

Update: 2023-05-15 13:01 GMT
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేనట్లుగా నిర్మల్ జిల్లా భైంసాలో 'ది కేరళ స్టోరీ' వివాదం అంతకంతకూ సా..గుతోంది. ఇక్కడి స్థానిక పోలీసుల తీరుతోనే ఈ గందరగోళం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా లేని పరిస్థితి భైంసాలోనే ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమా ప్రదర్శనపై గడిచిన మూడు రోజులుగా వివాదం నెలకొంది. తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో మాదిరే భైంసాలోనూ ది కేరళ స్టోరీ స్థానిక కమల థియేటర్ లో విడుదలైంది.

శుక్రవారం సినిమా ప్రారంభమయ్యే వేళలో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు షోను నిలిపేశారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ప్రేక్షకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సెన్సార్ అయిన మూవీని ఎందుకు అడ్డుకుంటున్నట్లు ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన భైంసా ఎస్ఐ.. థియేటర్ నిర్వహణకు అవసరమైన లైసెన్సును రెన్యువల్ చేసుకోలేదని.. అందుకే అడ్డుకున్నట్లుగా వివరణ ఇచ్చారు.

అయితే.. లైసెన్సు రెన్యువల్ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ శని.. ఆదివారాల్లోనూ షోను వేయకుండా అడ్డుకున్నట్లుగా చెబుతున్నారు. ఆదివారం సినిమాను ప్రదర్శించారు. మార్నింగ్ షో.. మ్యాట్నీ సాఫీగా సాగగా.. ఫస్ట్ షో వేయటానికి ముందు భైంసాటౌన్ ఇన్ ఛార్జి సీఐ చంద్రశేఖర్..ఎస్ఐ తిరుపతి వచ్చి.. షోను నిలిపివేశారు. దీంతో సినిమాను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులుఅభ్యంతరం వ్యక్తం చేశారు.

సినిమాను నిలిపేసిన సమాచారం తెలుసుకున్న హిందూ వాహిని కార్యకర్తలు థియేటర్ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. థియేటర్ లో షో ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించారు. అయితే.. పోలీసులు దీనికి పొంతన లేని సమాధానాలు చెప్పటమే కాదు. థియేటర్ మేనేజర్.. డిస్ట్రిబ్యూటర్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అనుమతి లేకుండా సినిమాను ఎలా ప్రదర్శిస్తారని ప్రశ్నించారు.

అనంతరం వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. థియేటర్ కు తాళం వేయించారు. ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణలో మరే ప్రాంతంలో లేనట్లుగా భైంసాలో ఇలాంటి పరిస్థితి ఉందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలన్న మాట బలంగా వినిపిస్తోంది.

Similar News