ప్రపంచకప్ గెలిచినోడు కచోరి అమ్ముతున్నాడు

Update: 2015-11-29 07:01 GMT
అతను క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. కానీ ఇప్పుడు రోడ్డు మీద కచోరి అమ్ముకుంటున్నాడు. చోటా మోటా క్రికెటర్లే కోట్లు సంపాదిస్తున్నపుడు.. ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు కచోరి అమ్మడమేంటి అని ఆశ్చర్యం కలుగుతోందా? ఇది నమ్మశక్యంగా లేదా? కానీ నమ్మి తీరాల్సిందే. ఐతే అతను కపిల్ దేవ్ జట్టులోనో, ధోనీ టీంలోనో సభ్యుడు కాదు. 2005లో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత బధిరుల టీంలో మెంబర్. ఈ క్రికెటర్ పేరు ఇమ్రాన్ షేక్. గుజరాత్ లోని బరోడాకు చెందిన ఈ సీనియర్ క్రికెటర్ పరిస్థితి చూస్తే కన్నీళ్ల రాకమానదు.

మూగ - చెవిటి వాడైన ఇమ్రాన్ షేక్ కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే మక్కువ. వైకల్యం ఉన్నా పట్టించుకోకుండా క్రికెట్లో నైపుణ్యం సంపాదించాడు. భారత జట్టులో చోటు సంపాదించాడు. 2005లో భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. గ్రూప్ దశలో నేపాల్ పై 70, న్యూజిలాండ్ పై 60 పరుగులు చేశాడు. కీలకమైన సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థిపై 62 పరుగులతో భారత్ ను ఫైనల్ చేర్చాడు. ఇంత గొప్ప ప్రదర్శన చేసి భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఇమ్రాన్ క్రికెట్ కెరీర్ లో పెద్దగా సంపాదించిందేమీ లేదు. కెరీర్ ముగిశాక అతడికి గుజరాత్ రిఫైనరీలో ఓ టెంపరరీ జాబ్ వచ్చింది. కానీ దాంతో వచ్చే జీతం సరిపోక బరోడా వీధుల్లో సాయంత్రం పూట కచోరి అమ్ముతున్నాడు షేక్. ఓవైపు టీమ్ ఇండియాకు ఆడే క్రికెటర్లు వందల కోట్లు సంపాదిస్తుంటే బధిరుల జట్టుకు ఆడిన షేక్ పరిస్థితి ఇలా ఉంది.
Tags:    

Similar News