కేటీయార్ కు సెగ మొదలైందా ?

Update: 2021-09-10 07:12 GMT
యువరాజు కేటీయార్ కు జనాల నిరసన సెగ మొదలైంది. అది కూడా ఎక్కడో కాదు తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనే. గడచిన నాలుగు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వరుసగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమైపోయాయి. చాలా కాలనీల్లో పల్లంలో ఉన్న ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చాయి. చాలా కాలనీల రోడ్లలో నీరు కాలువ ల్లా తయారయ్యాయి. దాంతో జనజీవనం కూడా కొన్ని ప్రాంతాల్లో దాదాపు స్తంబించిపోయింది.

వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన కారణంగా గురువారం తన నియోజకవర్గమైన శాంతినగర్ లో కార్మిక వాడలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు కేటీయార్ ను ఓ రేంజిలో ఆటాడేసుకున్నారు. వర్షాలు తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఏమి చూద్దామనుకున్నారంటు నిలదీశారు. కాసేపు అసలు కేటీఆర్ ను నొరెత్తనీయకుండా వాయించేశారు. వాళ్ళ ఆగ్రహాన్ని గ్రహించిన మంత్రి కాసేపు మాట్లాడలేదు. తర్వాత మాట్లాడుతూ వరద సమస్యలు తెలుసుకునేందుకు వర్షాల్లోనే తిరగాలా ? వర్షాలు తగ్గి పోయిన తర్వాత వస్తే సమస్యలేంటో తెలీదా ? అని ఎదురు ప్రశ్నించారు.

దాంతో మహిళలు మళ్ళీ రెచ్చిపోయారు. వర్షాల్లో వస్తే తాము పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసేవారని, తగ్గిపోయిన తర్వాత వస్తే తాము చెబితే కానీ సమస్యలు ఏమిటో తెలీదు కదా ? అంటూ ఎదురు ప్రశ్నించేసరికి కేటీయార్ ఏమీ మాట్లాడలేకపోయారు. వెంటనే తేరుకుని సమస్యలను పరిష్కరించేందుకే వచ్చానని, ఇలాంటి సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని పడికట్టు పదాలు చెప్పి ఆ ప్రాంతంలో కాసేపు తిరిగి వెళ్ళిపోయారు.

ఇక్కడ సమస్య ఏమిటంటే ఓ మోస్తరు వర్షానికి కూడా విశ్వనగరమని చెప్పుకునే హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల జలమయం అయిపోతాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళలోకి కూడా వరదనీళ్ళొచ్చేస్తాయి. ఈ విషయం ప్రభుత్వానికి బాగా తెలుసు. ఎందుకంటే గడచిన ఏడేళ్ళుగా వర్షాలు కురిసినపుడు ఏమి జరుగుతోందో కేసీయార్, కేటీయార్ తో పాటు అందరు చూస్తున్నదే.

పోయిన ఏడాది కురిసిన భారీ వర్షాలకు గ్రేటర్ మున్సిపల్ పరిధిలోని ఎన్ని కాలనీలు జలమయమైపోయాయో అందరు చూసిందే. అప్పుడా కాలనీల్లో పర్యటించిన మంత్రులు మళ్ళీ ఇలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. జనాల దెబ్బకు మంత్రులు కాలనీల్లో పర్యటించి హామీలు ఇచ్చారు కానీ మళ్ళీ పత్తాలేకుండా పోయారు. ఆ తర్వాత కురిసిన వర్షాలకు కూడా సేమ్ పరిస్థితి కంటిన్యూ అయ్యింది.

తాజా వర్షాలకు కూడా అదే పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటివరకు మంత్రులెవరు మళ్ళీ కాలనీల్లోకి అడుగు కూడా పెట్టలేదు. అప్పటి నుండి ఇప్పటికి వరదనీటిలో ఇబ్బందులు పడుతున్న జనాల దగ్గరకు వెళ్ళింది కేటీయార్ ఒక్కరే. అందుకనే అప్పటి నుండి తమలో పేరుకుపోయిన మంటనంతా కేటీయార్ ముందు కక్కేశారు. అంటే సొంత నియోజకవర్గంలోనే కేటీయార్ కు జనాల నిరసన సెగ బాగా తగిలిందనే అనుకోవాలి.


Tags:    

Similar News