ఆరు హ‌త్య‌లకు ఒకే ఒక‌ కార‌ణం..?

Update: 2021-04-16 05:09 GMT
ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తి మండ‌లం జుత్తాడ గ్రామంలో అప్ప‌ల్రాజు అనే వ్య‌క్తి త‌న ప‌క్కింటికి చెందిన ఆరుగురిని అతి దారుణంగా హ‌త‌మార్చిన విష‌యం తెలిసిందే. హ‌తుల్లో అభంశుభం తెలియ‌ని ఇద్ద‌రు చిన్నారులు కూడా ఉండ‌డం మ‌రింత‌గా క‌ల‌చివేసింది. అయితే.. పాత క‌క్ష‌ల నేప‌థ్యంలోనే ఈ హ‌త్య‌లు జ‌రిగాయ‌ని పోలీసులు తేల్చారు. కానీ.. ఆ క‌క్ష‌లు ఏంట‌న్న‌ది చాలా మందికి తెలియ‌లేదు. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. గ‌తంలో న‌డిచిన‌ ప్రేమ వ్య‌వ‌హారమే ఈ దారుణానికి అస‌లైన మూలంగా తెలుస్తోంది.

జుత్తాడ గ్రామంలో బ‌త్తిన‌, బొమ్మిడి కుటుంబాల‌కు చెందిన వారి ఇళ్లు ప‌క్క‌ప‌క్క‌నే ఉన్నాయి. రాత్రివేళ బొమ్మిడి కుటుంబం ఇంట్లోకి ప్ర‌వేశించిన బ‌త్తిన అప్ప‌ల్రాజు.. నిద్రిస్తున్న వారిపై ప‌దునైన క‌త్తితో దాడికి తెబ‌డ్డాడని పోలీసులు తెలిపారు. దొరికిన వారిని దొరికిన‌ట్టు న‌ర‌క‌డం మొద‌లు పెట్టాడు. ఈ దారుణంలో.. ఇద్ద‌రు చిన్నారులు స‌హా.. మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. హ‌త్య‌కు గురైన వారిలో బొమ్మిది ర‌మ‌ణ (63), బొమ్మిడి ఉషారాణి (35), అల్లూరి ర‌మాదేవి (53), న‌క్కెళ్ల అరుణ (37), బొమ్మిడి ఉద‌య్ (2), బొమ్మిడి ఉర్విష (6 నెల‌లు) ఉన్నారు. హ‌త్య‌లు చేసిన అనంత‌రం నిందితుడు పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి లొంగిపోయాడు.

అయితే.. ఈ దారుణం వెనుక ప్రేమ వ్య‌వ‌హారం ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. నిందితుడు అప్ప‌ల్రాజు కూతురు పార్వ‌తి, బొమ్మిడి ర‌మ‌ణ కుమారుడు విజ‌య్ ప్రేమించుకున్నార‌ట‌. అయితే.. పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పిన విజ‌య్ ఆమెను మోసం చేశాడ‌ట‌. ఈ మేర‌కు 2018లో విజ‌య్ పై కేసు కూడా న‌మోదైంద‌ని తెలుస్తోంది. ఈ గొడ‌వ‌ల నేప‌థ్యంలో విజ‌య‌వాడ వెళ్లిపోయిన విజ‌య్‌.. అక్క‌డే ఉషారాణి అనే యువ‌తిని పెళ్లి చేసుకున్నాడ‌ట‌. వీరికి ముగ్గురు పిల్ల‌లు జ‌న్మించారు. విజ‌య‌వాడ‌లోనే నివ‌సిస్తున్న విజ‌య్.. ఇటీవ‌లి ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు వ‌చ్చి, జుత్తాడ‌లోనే ఉండిపోయిన‌ట్టు స‌మాచారం.

ఇది గ‌మ‌నించిన అప్ప‌ల్రాజు.. విజ‌య్ తో స‌హా కుటుంబం మొత్తాన్ని హ‌త్య చేసేందుకు ప‌థ‌కం వేశాడ‌ని తెలుస్తోంది. అయితే.. హ‌త్యలు జ‌రిగిన స‌మ‌యంలో విజ‌య్ ఇంట్లో లేక‌పోవ‌డంతో.. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడ‌ని చెబుతున్నారు. కాగా.. బాధిత కుటుంబానికి చెందిన బంధువులు.. అప్ప‌ల్రాజు ఇంటిపై దాడికి య‌త్నించ‌గా.. పోలీసులు అడ్డుకున్నారు. వారి కుటుంబ స‌భ్యుల‌ను అప్ప‌గించాల‌ని డిమాండ్ చేసిన‌ట్టుగా తెలిసింది. దీంతో.. జుత్తాడ‌లో ఉద్రిక్త‌త కొన‌సాగుతోంది.
Tags:    

Similar News