ప్లాస్టిక్ తెచ్చి ఇస్తే.. బంగారం ఇస్తారు.. తర్వాతేమైందంటే?

Update: 2023-04-07 06:00 GMT
ఊరు ఏదైనా సరే.. చెత్తతో నిండిపోతున్న దుస్థితి. అలాంటి సదూరాన ఉన్న కుగ్రామాల్లోని పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెరిగిన ప్లాస్టిక్ వినియోగంతో.. ఊరంతా నాశనమైపోతున్న వేళ.. ఈ సమస్య పరిష్కారానికి ఒక సర్పంచ్ వినూత్నంగా ఆలోచించారు. ప్లాస్టిక్ తెచ్చి ఇస్తే బంగారం ఇస్తామన్న ఆఫర్ ను ప్రకటించిన ఆయన మాటకు.. కేవలం రెండు వారాల వ్యవధిలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఈ విచిత్రం జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని హిల్లర్షాబాద్ బ్లాక్ లో చోటు చేసుకుంది. ‘సాదివార’ పేరుతో ఉన్న గ్రామానికి సర్పంచ్ గా వ్యవహరిస్తున్నారు ఫారూక్. కొద్ది రోజుల క్రితం గ్రామ ప్రజలకు ఆయన బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్లాస్టిక్ ను తీసుకొచ్చి తనకు ఇస్తే బంగారు నాణెం ఇస్తానని చెప్పారు. కాకుంటే.. 20క్వింటాళ్ల చెత్తకు ఒక బంగారు నాణెం ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో.. గ్రామ ప్రజలంతా ప్లాస్టిక్ చెత్తను తీసుకొచ్చి.. బంగారు నాణెల్ని సొంతం చేసుకోవాలని భావించారు.

సదరు సర్పంచ్ మాటకు తగ్గట్లే.. కేవలం 14 రోజుల వ్యవధిలోనే భారీ ఎత్తున ప్లాస్టిక్ ను తీసుకొచ్చిన ప్రజలు బంగారు నాణెల్ని సొంతం చేసుకున్నారు. అదే సమయంలో ఊళ్లో చెత్త అన్నది లేకుండాపోయింది. చివరకు వాగులు.. కాలువులు సైతం క్లీన్ అయిపోయిన పరిస్థితి. దీంతో.. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు స్వయంగా గ్రామంలో పర్యటించి.. సదరు గ్రామాన్ని స్వచ్ఛభారత్ అభియాన్ 2 కింద ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటించటం గమనార్హం. దీంతో.. ఈ గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా మారటమే కాదు.. జాతీయ స్థాయిలో ఇదో కొత్త రోల్ మోడల్ గా మారిందని చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News