బాబును తిట్టే పార్టీ.. ఆయన విధానాల్ని ఫాలో అవుతుందే

Update: 2020-08-02 04:50 GMT
కాలం చాలా చిత్రమైంది. బాగున్నప్పుడు ఇంద్రుడు.. చంద్రుడు అని పొడిగేస్తారు. తేడా వచ్చాక.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తారు. ఎవరెన్ని అన్నా ఒక్కటి మాత్రం నిజం. తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీవోడు అయితే.. ప్రపంచ పటం మీద తెలుగోడికి టాలెంట్ ఉందని.. ఐటీలో తిరుగులేని పట్టు ఉందన్న విషయాన్ని తెలియజెప్పటంలో చంద్రబాబు పాత్రను తక్కువ చేయలేం. రాజకీయంగా ఆయన అనుసరించిన విధానాల్ని తప్పు పట్టొచ్చు. దాన్ని కాదనలేం. విజన్ విషయంలో ఆయన్ను తప్పు పట్టలేం.

దురదృష్టం కాకుంటే ఏమిటి? ఆయన ముందుచూపుతో చేసిన పనులు పలు రాజకీయ పార్టీలు ఫాలో అయితే.. తమ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంల మాదిరి గొప్పలు చెప్పుకోవటం స్పష్టంగా కనిపిస్తుంటుంది. అంతదాకా ఎందుకు? ఒకప్పుడు తెలుగునాట ఏ రాజకీయ పార్టీని చూసినా అందులో ఉండే నేత బ్యాక్ గ్రౌండ్ కాంగ్రెస్సే. అందుకు భిన్నంగా ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో చెలరేగిపోతున్న పార్టీల్లో కీలకభూమిక పోషించే వారంతా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనన్న విషయాన్ని మర్చిపోకూడదు.

తాజాగా టీఆర్ఎస్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల బీమా కోసం రూ.16.11 కోట్ల మొత్తాన్ని బీమా కంపెనీకి చెల్లించారు. ఎందుకంటే.. ప్రమాదవశాత్తు చనిపోయే టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు వీలుగా వారికి బీమా చేయించారు. ఎవరైనా టీఆర్ఎస్ కార్యకర్తలు మరణిస్తే.. వారికి గ్రూప్ ఇన్స్యురెన్సు ఉంటుంది. దీంతో.. ఇంటి పెద్ద అనుకోని రీతిలో మరణిస్తే.. వారికి దన్నుగా ఉండేందుకు వీలుగా ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు.

ఇంతకీ ఈ కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? తెలుగుదేశం పార్టీలోనే. తమ పార్టీలో పెద్ద ఎత్తున కార్యకర్తల్ని చేర్చుకోవటమే కాదు.. వారికి ఏదైనా అయితే.. పార్టీ అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ కార్యకర్తలందరికి గ్రూపు ఇన్స్యురెన్సు సదుపాయం కల్పించారు. దీనికి అయ్యే ఖర్చు కంటే కూడా.. లక్షలాదిగా ఉండే పార్టీ కార్యకర్తలకు దన్నుగా నిలుస్తుంది. దీంతో.. టీడీపీ అమలు చేస్తున్న బీమా సౌకర్యాన్ని తర్వాతి రోజుల్లో చాలా పార్టీలు ఫాలో అయ్యాయి. అలా ఫాలో అయ్యే పార్టీల్లో ఒకటి టీఆర్ఎస్. రాజకీయంగా టీడీపీని.. దాని అధినేతను తిట్టిపోసే టీఆర్ఎస్.. బాబు ఆలోచనల్ని మాత్రం తమకు తగ్గట్లుగా మార్చుకొని వాడుకోవటం చూస్తే.. బాబు ముందుచూపును అభినందించాల్సిందే.
Tags:    

Similar News