పోలవరం: బాబు చేసిన పాపం.. జగన్ కడిగేశాడిలా.!

Update: 2020-11-03 09:10 GMT
గత చంద్రబాబు హయాంలో పోలవరం విషయంలో టీడీపీ ప్రభుత్వం చేసిన జాప్యం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ కు శాపమైంది. ఏపీ కలల ప్రాజెక్ట్ ముందుకెళ్లకుండా నిధుల కొరత ఏర్పడింది. పాత అంచనాలపై దమ్మిడి పని కూడా సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది.

సవరించిన అంచనా వ్యయం మేరకు నిధులు విడుదల చేస్తేనే ప్రాజెక్ట్ పూర్తి చేయడం సాధ్యమవుతుందని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎం జగన్ ప్రధాని మోడీకి పోలవరం అథారిటీకి, కేంద్ర జలసంఘం దృష్టికి తీసుకెళ్లారు. 2017-18 సవరించిన ధరల ప్రకారం నిధులు విడుదల చేయాలని కోరారు.ఏపీ ప్రభుత్వ వాదనతో తాజాగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) ఏకీభవించింది. 2013-14 ధరల ప్రకారం ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం సాధ్యం కాదని కేంద్రానికి వివరిస్తామని తెలిపింది. 2017-18 ధరల ప్రకారం ప్రాజెక్ట్ కు నిధులు విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని పేర్కొంది.

నాడు చంద్రబాబు పోలవరంను ఏటీఎంలా వాడుకున్నాడని గత ఎన్నికల్లో మోడీ ఆరోపించారు. నిజంగానే ఐదేళ్లలో బాబు కనుక చిత్తశుద్ధితో పోలవరం పూర్తి చేసి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. కేంద్రం ఇచ్చిన ఆ నిధులతో పూర్తి చేస్తే జగన్ సర్కార్ కు ఇప్పుడీ కష్టాలు తప్పేవి. కానీ కమీషన్ల కోసం పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి దక్కించుకున్న చంద్రబాబు.. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు 2010–11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లు ఇస్తామన్న కేంద్రం షరతుకు అంగీకరించడంతోనే ఇప్పుడు అవే ధరలను కేంద్రం ఇస్తానంటూ జగన్ సర్కార్ ను ఇరుకునపెడుతోంది. పాత ధరలతో పోలవరం సాధ్యం కాదని జగన్ సర్కార్ మొత్తుకుంటున్నా అంగీకరించడం లేదు..

2014 ఏప్రిల్‌ 1 నాటి ధర మేరకు నీటి పారుదల విభాగానికి అయ్యే ఖర్చును మాత్రమే ఇస్తామంటూ కేంద్రం విధించిన షరతుకు చంద్రబాబు నాడు తలొగ్గారని తాజాగా జగన్ ఎత్తిచూపారు. నాడు అంగీకరించి బాబు తప్పు చేయడం ఇప్పుడు పోలవరం నిర్మాణం జాప్యానికి నిధుల కొరతకు అవరోధంగా మారిందని వైసీపీ సర్కార్ ఆరోపిస్తోంది.

2016 సెప్టెంబర్‌ 7 అర్ధరాత్రి రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక సహాయానికి చంద్రబాబు అంగీకరించారు. దాని అమలుకు సంబంధించి 2016 సెప్టెంబర్‌ 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమోరాండంలోనూ 2014 ఏప్రిల్‌ 1 నాటి ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు.

ఇదే అంశంపై 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్‌ తీర్మానం చేసింది. ఆ కేబినెట్‌లో టీడీపీ నుంచి ఇద్దరు మంత్రులు అశోక గజపతి రాజు, సుజనా చౌదరి ఉన్నారు. ప్రాజెక్టుకు అన్యాయం జరుగుతుంటే వారు ఎందుకు ప్రశ్నించలేకపోయారని వైసీపీ నినదిస్తోంది.

మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వం కేవలం నిధుల గురించే చూసిందే తప్పా ప్రాజెక్ట్ గురించి.. దాని పూర్తి చేయాలన్న చిత్తశుద్దిని చూపలేదని వైసీపీ ఆరోపిస్తోంది. అదే ఇప్పుడు పోలవరం అంచనాలు పెరిగేలా చేసి.. కేంద్రం కొర్రీలు వేయడానికి కారణమవుతోందంటోంది. బాబు చేసిన పాపం.. ఇప్పుడు జగన్ కు కష్టాలు తెచ్చిపెట్టింది. పోలవరం ఆగిపోయేలా చేసిందని వైసీపీ వర్గాలు ఆడిపోసుకుంటున్నాయి.
Tags:    

Similar News