విరాళాల సేకరణలో టాప్ తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలే

Update: 2020-05-07 08:10 GMT
రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించటం కొత్త విషయం ఏమీ కాదు. కానీ.. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల్లో పెద్ద ఎత్తున విరాళాలు సేకరించిన రికార్డు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికారపక్షానికి చెందినవే కావటం విశేషం. 2018-19 సంవత్సరానికి సంబంధించి ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక విరాళాలు సేకరించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.

142 సంస్థలు.. వ్యక్తులు కలిపి ఏడాదిలో రూ.80.57 కోట్ల మొత్తాన్ని ఏపీ అధికార పక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్లుగా తేలింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక విరాళాల్ని సేకరించిన పార్టీగా టాప్ లో నిలిచింది. రెండో స్థానంలో తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ నిలిచింది. ఈ పార్టీకి 43 కార్పొరేట్.. వ్యాపార సంస్థలు రూ.70.61 కోట్లు ఇస్తే.. మరో 78 మంది రూ.9.74 కోట్లు ఇచ్చినట్లుగా తేలింది.

2018-19 సంవత్సరానికి గాను దేశంలోని 25 ప్రాంతీయ పార్టీలు సమర్పించిన విరాళాల జాబితాను అధ్యయం చేసిన ఏడీఆర్ సంస్థ తాజాగా ఈ విషయాల్ని వెల్లడించింది. వైఎస్సార్ కాంగ్రెస్.. టీఆర్ఎస్ పార్టీల తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది ఆ పార్టీకి రూ.26 కోట్ల మేర విరాళాలు అందాయి. ఏపీ విపక్షం తెలుగుదేశం పార్టీకి రూ.26.17 కోట్ల విరాళాలు రావటం గమనార్హం. అంతకు ముందుతో సంవత్సరాలతో పోలిస్తే.. పెద్ద ఎత్తున విరాళాలు రావటం గమనార్హం. 2017-18లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రూ.8.35 కోట్లు విరాళాలుగా రాగా.. ఏడాదిలో 865 శాతం పెరిగి ఏకంగా రూ.80.57 కోట్లకు రావటం విశేషం. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి 2017-18లో రూ.1.73 కోట్లు విరాళాలుగా రాగా.. తర్వాతి ఏడాదిలో 1407 శాతం పెరుగుదలతో రూ.26.17 కోట్లు విరాళంగా వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీకి సైతం 1148 శాతం పెరిగింది.  
Tags:    

Similar News