మైసూరా త‌వ్వి తీసిందేంటి... సీమ జ‌నాల ఫైర్‌..!

Update: 2021-07-24 07:30 GMT
ఎంవీ మైసూరా రెడ్డి. మాజీ ఎంపీగా, సీనియ‌ర్ నాయ‌కుడిగా.. మేధావిగా కూడా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు తెలిసిన నాయ‌కుడు. అయితే.. కొన్నేళ్లుగా రాజ‌కీయంగా త‌ట‌స్థంగా ఉన్న ఎంవీ.. ఇటీవ‌ల మీడియా ముందుకు వ‌చ్చారు. రాయ‌లసీమ ప్రాజెక్టు స‌హా రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య చోటు చేసుకున్న జ‌ల వివాదాల‌పై ఆయ‌న స్పందించారు. ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు క‌లిసి కూర్చుని మాట్లాడుకుంటే.. స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని అంటూనే సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం నీళ్లు తోడేస్తున్నా.. జ‌గ‌న్ నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. ఆయ‌న వేరే ఉద్దేశంతో ఉన్నార‌ని.. ఎంవీ కామెంట్లు చేశారు.

ఎంవీ వ్యాఖ్య‌ల‌పై సీమ ప్రాంత వైసీపీ నాయ‌కులు స‌హా.. ప్ర‌జ‌లు సైతం.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సీమ ను స‌శ్య శ్యామ‌లం చేసేందుకు జ‌గ‌న్‌.. ప్ర‌య‌త్నిస్తుంటే.. ఈ విష‌యం ఎంవీకి క‌నిపించ‌డం లేదా? అంటూ.. సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. గ‌త చంద్ర‌బాబు ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 2019 వరకు తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే పట్టించుకోని మైసూరా.. ఇప్పుడు అన్యాయం జరుగుతోందని మాట్లాడడం విడ్డూరంగా ఉంద‌ని ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాదు, కేవలం 800 అడుగులలోపే తెలంగాణ నీటిని తరలించుకుపోతుంటే గత ఐదేళ్లలో నోరు విప్పకపోవడం రాయలసీమపై ఎంవీకి ఉన్న వాత్స‌ల్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని.. విమ‌ర్శ‌లు రువ్వుతున్నారు.

మ‌రికొంద‌రు.. ఎంతో సీనియ‌ర్ అయిన మైసూరా.. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల‌పై పెద్ద‌రికంగా వ్య‌వ‌హ రించి ఉంటే బాగుండేద‌ని.. అటు తెలంగాణ‌లోనూ మైసూరా.. అందరికీ సుప‌రిచితులైన నాయ‌కుడేన‌ని.. కాబ‌ట్టి.. ఇరు రాష్ట్రాల త‌ర‌ఫున ఆయన చ‌ర్చించేందుకు ముందు వ‌స్తాన‌ని పిలుపు ఇచ్చి ఉంటే.. పెద్ద‌రికంగా ఉండేద‌ని అంటున్నారు. అంతే త‌ప్ప‌.. కేవ‌లం జ‌గన్‌ను విమ‌ర్శించేందుకు, తెలంగాణ‌ను ప‌రోక్షంగా ప‌న్నెత్తు మాట కూడా అన‌కుండా వ్య‌వ‌హ‌రించేందుకు మాత్ర‌మే ఆయ‌న ప‌రిమిత‌మైతే.. మైసూరాను సీమ ప్ర‌జ‌లు క్ష‌మించ‌ర‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇదే విష‌యంపై సీమ‌లో మేధావులు కూడా చ‌ర్చిస్తున్నారు. మైసూరా స్థాయికి ఆయ‌న వ్య‌వ‌హ‌రించాల్సిన తీరుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించార‌ని.. విశ్లేష‌కులు సైతం అభిప్రాయ‌ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇంకొంద‌రు.. కేవ‌లం టీడీపీ అధినేత చంద్ర‌బాబు సూచ‌న‌లు , స‌ల‌హాల మేర‌కు మీడియా ముందుకు వ‌చ్చారంటూ.. మైసూరాపై కామెంట్లు చేస్తున్నారు. అంతా కూడా టీడీపీ స్క్రిప్టు చ‌దివార‌ని అనే వారు కూడా సోష‌ల్ మీడియాలో క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి జ‌ల వివాదాల‌తో హైలెట్ అవుదామ‌ని అనుకున్న మైసూరాకు పెద్ద ఎఫెక్టే వ‌చ్చిప‌డింద‌ని అంటున్నారు పరిశీల‌కులు.





Tags:    

Similar News