ఏపీలో పాదయాత్రకు సిద్ధమవుతున్న మరో రెండు పార్టీలివే!

Update: 2022-11-16 06:04 GMT
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ఎన్నికల వ్యవహారాల్లో మునిగిపోయాయి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ, జనసేన–బీజేపీ ఉవ్విళ్లూరుతున్నాయి.

ఈ క్రమంలో ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తన పాదయాత్రను ప్రకటించారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు ఏకంగా 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. జనవరి 28న మొదలయ్యే ఈ పాదయాత్ర దాదాపు 400 రోజులు సాగేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకుంటున్నారు.

ఇక జనసేనాని పవన్‌ కల్యాణ్‌ సైతం ఇప్పటికే పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నా.. దాన్ని బస్సు యాత్రగా మార్చారు. ఈ ఏడాది అక్టోబర్‌ నుంచే ఆయన పాదయాత్ర చేయాల్సి ఉంది. అయితే సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర మొదలుపెట్టాలని నిర్ణయించారు.

ఇప్పుడు టీడీపీ, జనసేన కోవలోనే ఏపీ కాంగ్రెస్‌ పార్టీ సైతం పాదయాత్రకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్, వైసీపీ రెండూ ఒక తానులో ముక్కలేనని ఆయన ఆరోపిస్తున్నారు. బీజేపీ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలగదని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరగాలంటే అది ఆంధ్రప్రదేశ్‌ వల్లే అవుతుందని శైలజానాథ్‌ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తన పాదయాత్రకు ప్రజలంతా మద్దతివ్వాలని కోరుతున్నారు. డిసెంబర్‌ నుంచి తాను పాదయాత్ర చేస్తానని శైలజానాథ్‌ ప్రకటించారు.

అదేవిధంగా బీజేపీ సైతం తాను తక్కువ తినలేదని చెబుతోంది. తాము సైతం పాదయాత్ర చేయబోతున్నామని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సత్యకుమార్‌ చెబుతున్నారు. అయితే తాము చేసేది వ్యక్తిగత పాదయాత్ర కాదని.. బీజేపీ నేతలమంతా కలిసి రాష్ట్రమంతా పాదయాత్రగా పర్యటిస్తామని సత్యకుమార్‌ వివరించారు. సంక్రాంతి తర్వాత పాదయాత్ర సాగుతుందని అంటున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా బీజేపీ ఈ యాత్ర చేపడుతుందని చెబుతున్నారు. ఆరు నెలలపాటు పాదయాత్ర ఉంటుందని పేర్కొంటున్నారు.

ఇలా అన్ని పార్టీలు 2022 చివర నుంచి పాదయాత్రలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యలో ఓటరు మహాశయుడు ఏ పార్టీకి జైకొడతాడో వేచిచూడాల్సిందే!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News