ఆ కుటుంబం ఏ పార్టీలో ఉన్నా.. గెలుపు మాత్రం వారింట్లోనే!

Update: 2022-02-23 09:30 GMT
ఎన్నికల్లో విజయం అంటే అంత తేలికైన విషయం కాదు. కొమ్ములు తిరిగిన నేతలు సైతం ఎన్నికల్లో మాత్రం బొక్కబోర్లా పడుతుంటారు. అందుకు భిన్నంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. గెలుపు మాత్రం తమ వాకిట్లో ఉంచుకునే రాజకీయ కుటుంబం ఒకటి యూపీలో ఉంది. గడిచిన 30 ఏళ్లుగా వారి కుటుంబమే సదరు అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుగులేని రీతిలో దూసుకెళుతోంది. మరింత విచిత్రమైన విషయం ఏమంటే.. సదరు పొలిటికల్ ఫ్యామిలీ ఏ పార్టీలో ఉండే.. ఆ పార్టీ వారిదే గెలుపు కావటం మరో విశేషం. ఇంతకూ ఆ పొలిటికల్ ఫ్యామిలీ ఏమిటి? వారు ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ నియోజకవర్గం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ సర్దార్ అసెంబ్లీ నియోజకవర్గం సమ్ థింగ్ స్పెషల్ అని చెప్పాలి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ ఎంపీ స్థానం పరిధిలో ఉండే అసెంబ్లీ స్థానానికి రారాజుగా అఖిలేశ్ సింగ్ కుటుంబం ఉంటుంది. 1993 నుంచి ఇప్పటివరకు జరిగిన ఏ అసెంబ్లీ ఎన్నికల్లో అయినా.. వారి కుటుంబానిదే విజయం కావటం విశేషం. అలా అని ఒకే పార్టీలో ఉండలేదు. కాంగ్రెస్ తో మొదలైన వారి ప్రస్థానం.. ఇప్పటికే పలు పార్టీలు తిరిగి ప్రస్తుతం బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.

నిజానికి అఖిలేశ్ సింగ్.. గాంధీ ఫ్యామిలీకి.. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు. 1993లో జరిగిన ఎన్నికలతో ఆయన పొలిటికల్ కెరీర్ షురూ అయ్యింది. రాయ్ బరేలీ సర్దార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు. ఆ తర్వాత 1996.. 2002లోనూ ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ మీదనే విజయాల్ని సొంతం చేసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ తో ఆయనకు విభేదాలు మొదలయ్యాయి.

దీంతో.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది కాంగ్రెస్. దీంతో.. 2007లో జరిగి ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఎప్పటిలానే విజయం సాధించారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఆ ఎన్నికల్లో ఆయన ఏకంగా 76 వేల ఓట్ల మెుజార్టీని సొంతం చేసుకున్నారు.

ఆ తర్వాత ఐదేళ్లు గడిచిన తర్వాత 2012లో జరిగిన ఎన్నికల్లో ఆయన పీస్ పార్టీతో జత కట్టారు. ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన్ను.. నియోజకవర్గ ప్రజలు మరోసారి గెలుపు గుర్రం మీద కూర్చోబెట్టారు. ఇదిలా ఉంటే.. ఐదేళ్ల క్రితం ఆయన రాజకీయాల నుంచి వైదొలిగారు. అయితేనేం.. ఆయన రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె అదితి సింగ్ సీన్లోకి వచ్చారు. తండ్రికి అలవాటైన గెలుపును.. ఆమె కూడా సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమె విజయం సాధించారు.

యూపీలో కాంగ్రెస్ కున్న ప్రజాదరణ ఎంతన్నది తెలిసిందే. అలాంటిది ఆదితి మాత్రం కాంగ్రెస్ టికెట్ మీద విజయం సాధించారు. అయితే.. గత ఏడాది కాంగ్రెస్ తీరుపై తీవ్రంగా విమర్శించిన ఆమె ఆ పార్టీని వదిలేసి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆమె గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 30 ఏళ్లుగా గెలుపు తప్పించి ఓటమి తెలీని ఈ పొలిటికల్ ఫ్యామిలీకి తాజా ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలి.



Tags:    

Similar News