ప్రధాని మోడీ ముందు సీఎం జగన్ పెట్టిన సమస్యల చిట్టా ఇదేనట

Update: 2022-04-06 02:42 GMT
ప్రధాని నరేంద్ర మోడీతో మరోసారి భేటీ అయ్యారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాజా భేటీ సైతం గంటకు పైనే సాగింది.ఈ సమావేశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి అధికారికంగా విడుదలైన సమాచారం.. భేటీ వివరాల విషయానికి వస్తే.. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యల్ని ప్రధానికి వివరించటంతో పాటు.. ఆ సమస్యల పరిష్కారానికి తమకు సాయం చేయాలని కోరినట్లుగా పేర్కొన్నారు. ఇంతకూ ప్రధాని నరేంద్ర మోడీ ముందు సీఎం జగన్ పెట్టిన సమస్యల చిట్టా ఏమిటి? అన్నది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. ఈ సమస్యల చిట్టాను వినేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గంటకు పైనే సమయాన్ని కేటాయించి ఓపిగ్గా విన్నారా? అన్నది ప్రశ్నగా మారింది. ఇంతకూ మోడీ మాష్టారితో సీఎం జగన్ అనే సీఎం స్టూడెంట్ చర్చించిన సమస్యల చిట్టా ఇదేనని చెబుతున్నారు.

ఆ వివరాల్నిచూస్తే..పోలవరం
- పోలవరానికి సంబంధించి 2019 ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ.55, 548.87 కోట్లుగా నిర్ధారించారు. ఈ అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలి.
-  ప్రాజెక్టును పూర్తికి ఇంకా రూ.31,188 కోట్లు ఖర్చు ఉంది. ఇందులో నిర్మాణ పనుల కోసం రూ.8,590 కోట్లు, భూ సేకరణ, పునరావాసం కోసం రూ.22,598 కోట్లు వ్యయం కానుంది. వాటికి సాయం అందించాలి.
-  పోలవరం నిర్మాణంలో కాంపొనెంట్‌ వైజ్‌గా బిల్లుల చెల్లింపు పద్దతిని మార్చాలి.  ఇప్పుడు అనుసరిస్తున్న విధానంలో రాష్ట్రం చేసే ఖర్చుకు.. కేంద్రం చెల్లించే బిల్లుల మొత్తంలో వ్యత్యాసం భారీగా ఉంటోంది.
- ఇప్పుడు అనుసరిస్తున్న విధానంతో రూ.905 కోట్ల బిల్లుల్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ రిజెక్టు చేసింది.
- కాంపోనెంట్ల ఆధారంగా కాకుండా మొత్తం ప్రాజెక్టుల్లోజరిగే పనుల్ని పరిగణలోకి తీసుకోవాలి. అందుకు సంబంధించిన నిధుల్ని వెంటనే విడుదల చేయాలి.
-  నిర్వాసిత కుటుంబాలకు ఆలస్యం చేయకుండా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేయాలి.

కడప స్టీల్ ప్లాంట్
- విభజన సందర్భంగా కడపలో సమగ్ర స్టీల్ ప్లాంట్ పెడతామని అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ.. ఇందుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మెకాన్ ఇప్పటికి నివేదిక ఇవ్వలేదు.
-  రాయలసీమ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. దీనికి కేంద్రం సాయం చేయాలి.

మెడికల్ కాలేజీలు
- ఇప్పటికే ఏపీలో 11 బోధనాసుపత్రులు ఉన్నాయి. కొత్తగా మరో మూడింటికి కేంద్రం ఓకే చేసింది. వీటి పనులు చురుగ్గా సాగుతున్నాయి.
- కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఏపీలోని మరో 13 బోధనాసుపత్రులకు వెంటనే అనుమతులు ఇవ్వాలి.

రెవెన్యూ లోటు భర్తీ చేయాల
- విభజన కారణంగా ఏపీకి భారీ నష్టం వాటిల్లింది. రెవెన్యూ గ్యాప్ భర్తీకి ఇచ్చిన నిధుల్లో పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉంది.
-  విభజన నాటికి పెండింగ్ లో ఉన్న  భారీ బిల్లులు.. 10వ వేతన సంఘం సిఫార్సుల అమలుతో చెల్లించాల్సిన బకాయిల రూపంలో దాదాపు రూ.32వేలకు పైనే నిధుల్ని రాష్ట్రం సొంతంగా ఖర్చు చేసింది.
-  రెవెన్యూ లోటు కింద భర్తీ చేయటంతో పాటు.. విభజనతో 58 శాతం ఉన్నజనాభా ఉన్న రాష్ట్రానికి కేవలం 46 శాతం మాత్రమే ఆదాయం దక్కింది. హైదారబాద్ ను కోల్పోవటంతో ఆ నగరం నుంచి అందే 38 శాతం ఆదాయాన్నికోల్పోయాం.
-  కొవిడ్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బ తింది. దాదాపు రూ.33వేల కోట్లకు పైనే ఆదాయాన్ని కోల్పోయాం.
-  15వ ఆర్థిక సంఘం కేటాయింపులు రాష్ట్రానికి తగ్గిపోయాయి. ఇదో ప్రతికూలాంశం.
-  గత ప్రభుత్వం అదనపు రుణాలకు అనుమతులు ఇచ్చారు. దానికి సంబంధించిన వాటిని తాజా రుణ పరిమితుల్లోకోత విధిస్తామంటున్నారు. దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రుణ పరిమితిని సవరించాలి.

తెలంగాణ నుంచి భారీ విద్యుత్ బకాయిలు
- ఏపీ జెన్ కో కు తెలంగాణ డిస్కమ్ లు రూ.6.4వేల కోట్ల బకాయిల్ని చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర విభజన నాటి నుంచి 2017 వరకు తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్ బకాయిలు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నాయి.
-  బకాయిల్ని తెలంగాణ నుంచి ఇప్పించి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీ డిస్కంలను ఆదుకోవాలి. దీనికి సంబంధించిన ఆదేశాల్ని ఇవ్వాలి.
-  భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు సంబంధించి సైట్ క్లియరెన్సు అప్రూవల్ గడువు ముగిసింది. దీనికి క్లియరెన్సు ఇవ్వాలి. పౌర విమానయాన శాఖ ఆదేశాలు ఇవ్వాలి.
Tags:    

Similar News