ఏపీలో దేవుళ్లు చాలా కాస్ట్‌ లీ గురూ!

Update: 2016-10-05 22:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో దేవుళ్లు ఖ‌రీదు అయిపోతున్నారు. మానసిక ప్రశాంతత కోసం ఆలయాలకు వచ్చే భక్తుల నుండి సాధ్యమైనంత రాబట్టడానికి సర్కారు సన్నాహాలు చేస్తుండ‌ట‌మే ఇందుకు కార‌ణం. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న సమీక్ష‌లో  దేవాలయాల నుండి ఆదాయం పెరుగుతోందని, దానిపై మరింతగా దృష్టి పెట్టాలని  అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శరవేగంగా చార్జీల పెంపు వైపు అడుగులు పడుతుండ‌టంతో కొత్త చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇటీవ‌ల రెండు దేవాల‌యాల‌కు ఎగ్జిక్యూటివ్ అధికారులుగా ఐఏఎస్‌ లను నియమించడం కూడా దేవాల‌యాల‌కు వెళ్లే భ‌క్తుల న‌డ్డివిరిచేందుకేన‌ని అంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపట్టడానికి ఐఎఎస్‌ అధికారులను నియమిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిన‌ప్ప‌టికీ  ప్రస్తుతం నియామకం జరిగిన రెండు ఆలయాల్లోనూ ఆదాయాన్ని పెంచడంపైనే వీరు ఎక్కువగా దృష్టి సారించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రధాన ఆలయాల్లో ఇప్పటికే సేవల ధరలు పెరిగాయి. మిగిలిన దేవాలయాల్లో కూడా పెంచాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో కొన్ని సేవల ధరలను ఒక్కసారిగా పెంచుతూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన ఏ గ్రేడ్‌ ఆలయాల్లోనూ దశలవారీగా పెంచే యోచనలో కసరత్తు జరుగుతోంది. శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు పెంచిన ధరల నేపధ్యంలో భక్తుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. రద్దీ రోజుల పేరుతో ధరలు పెంచి రెండు రకాల టికెట్ల విధానాన్ని కొంత కాలంగా అమలు చేస్తున్న ఆలయ వర్గాలు ఈ నెల 20 నుంచి మరో కొత్త విధానాన్ని ఆమల్లోకి తీసుకొచ్చారు. ఇందులో ఆర్జిత సేవల టికెట్ల ధరలను భారీగా పెంచారు. అంతరాలయ అభిషేకం సేవను కొత్తగా ప్రవేశపెట్టి ధరను రూ. 5 వేలుగా నిర్ణయించారు. సామూహిక అభిషేకం టికెట్‌ను రూ. వెయ్యి నుంచి రూ. 15 వందలకు పెంచారు. కుంకుమార్చన టికెట్‌ మూడు రెట్లు వరకు పెంచారు. ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌ బుక్కింగ్‌ సౌకర్యం పేరుతో రూ. 15 వందలుగా నిర్ణయించి రెండు రకాల టికెట్ల విధానాన్ని అమలు చేస్తున్నారు. సుప్రబాతం సేవ తిరుమల కంటే శ్రీశైలంలోనే ఎక్కువగా ఉంది. తిరుమలలో రూ. 120 ఉంటే శ్రీశైలంలో మాత్రం రూ. 500లుగా ధర నిర్ణయించారు. భక్తుల నుండి వ్యతిరేకత వస్తున్నప్పటికీ అదే బాటలో మిగిలిన ఆలయాలనూ నడిపించాలని దేవాదాయశాఖను సర్కారు ఆదేశించినట్లు సమాచారం.

ఆర్జిత సేవల పెంపుపై తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ కసరత్తు జరుగుతోంది. అయితే, భక్తుల నుండి వ్యతిరేకత వస్తుందన్న ఆందోళన అధికారులను వెంటాడుతుండ‌టంతో వెనకడుగు వేస్తున్నారు. ఆర్జిత సేవల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు మూడు నెలల క్రితం జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో చ‌ర్చ‌కు రాగా సభ్యులు వ్యతిరేకించడంతో అప్పట్లో బ్రేక్‌ పడింది. లడ్డూ ప్రసాదం ధరలు పెంచనప్పటికీ పరిమాణాన్ని టీటీడీ తగ్గించడం విశేషం. అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో గతంలో సుప్రభాత సేవ ధర రూ. 100 ఉండేది. ప్రస్తుతం రూ. 116కి పెరిగింది. శీఘ్రదర్శనం రూ. 50 ఉండేది. ప్రస్తుతం రూ. 100కి పెరిగింది. గతంలో ఉపనయనం సేవల ధర రూ. 60 ఉండగా, ప్రస్తుతం రూ. 100కి పెరిగింది. అన్నప్రసాన రూ.20 నుంచి ఒక్కసారిగా రూ. 100కి పెంచారు. వ్రతాల సేవల్లో మొదటి రకం రూ. 1116కి ఉండగా, రూ. 1500కి పెరిగింది. రెండోరకం వ్రతం రూ.500 నుంచి రూ. 700కి పెరిగింది. మూడోరకం రూ.200 నుంచి రూ. 300లు, నాలుగోరకం రూ. 125 నుంచి రూ.150కి పెరిగింది.

విజయవాడలో కనకదుర్గ ఆలయంలో సహస్ర కుంకుమార్చన గతంలో 100గా ఉండేది. దానిని రూ.150కి పెంచారు. రుద్రాభిషేకం గతంలో రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.30కి పెంచారు. లక్ష కుంకుమార్చన రూ.1000 కాగా, రూ.1200కి పెంచారు. శాంతికల్యాణం - శ్రీచక్రనవార్చన - పల్లకి సేవ ధరలు పెరిగాయి. సింహాచలం ఆలయంలో కప్పస్తంభం ఆలింగనం సేవల టికెట్‌ ధర గతంలో రూ. 10 ఉండేది. ప్రస్తుతం రూ.25కి పెరిగింది. నిత్యకల్యాణం రూ.2వేలు ఉండగా రూ. వెయ్యికి తగ్గించారు. స్వర్ణ పుష్పార్చన రూ. 2500లు ఉండగా, రూ.1116కి తగ్గించారు. అష్ట్రోత్తరం రూ.100 ఉండగా , రూ. 200కు పెరిగింది. సహస్రనామార్చన గతంలో రూ.200 ఉండగా , ప్రస్తుతం రూ.500కి పెంచారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News