చైనాలో అలజడి రేగేలా చేసిన టిక్ టాక్ వీడియో

Update: 2019-11-28 09:01 GMT
40 సెకన్లు అంటే నలభై సెకన్లు మాత్రమే. ఎంతసేపు చెప్పామన్నది కాదు ముఖ్యం.. ఏం చెప్పామన్నది కీలకమన్న విషయాన్ని అక్షరాల రుజువు చేసిందా అమ్మాయి. మేకప్ వీడియో అంటూ.. కనురెప్పల్ని సొగసుగా ఎలా ట్రిమ్ చేసుకోవాలో చెప్పేలా ఉండే ఈ వీడియోలో అసలు విషయం సంచలనంగా మారటమే కాదు.. చైనా సర్కారుకు చెమటలు పట్టేలా చేసింది.

ఫెరోరా అజీజ్ అనే యువతి పెట్టిన ఈ వీడియో చైనాలో రాజకీయ దుమారానికి కారణమైంది. చైనాలో నిర్భంద శిబిరాల్లో ముస్లింలు మగ్గిపోతున్నారన్న ఆవేదనతో పాటు వారిని రకరకాలుగా చిత్రహింసలు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యింది. వీగర్ ముస్లింలు శిబిరాల్లో నరకయాతనను అనుభవిస్తున్నట్లుగా ఆక్రోశాన్ని వెళ్లగక్కింది.

విశేష స్పందన వచ్చిన ఈ వీడియోకు మిలియన్ల వ్యూస్ రాగా.. లక్షల్లో లైకులు వచ్చాయి. చైనా ప్రభుత్వానికి షాకిచ్చిన ఈ వీడియోను యుద్ధప్రాతిపదికన టిక్ టాక్ యాజమాన్యం సదరు యువతికి చెందిన అకౌంట్ ను నిలిపివేసింది. అయితే.. ఈ వీడియో ఇప్పటికే వైరల్ కావటంతో అనేకమంది యూజర్లు ఈ వీడియోను తిరిగి పోస్టు చేయటంతో టిక్ టాక్ యాజమాన్యం సైతం ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంది.

తన అకౌంట్ ను బ్లాక్ చేయటం ద్వారా తనను అణిచివేయలేరని.. చైనాలో ముస్లింలపై జరుగుతున్న దాడులపైనా.. దారుణాలపైనా తాను గళం విప్పుతానని ఆమె చెబుతుంటే టిక్ టాక్ యాజమాన్యం మాత్రం మరోలాంటి వాదనను వినిపించింది. ఆమెకు సంబంధించిన అకౌంట్లో బిన్ లాడెన్ ఫోటోను షేర్ చేశారని వెల్లడించారు. ఉగ్రవాద సంబంధిత సమాచారాన్ని వ్యాప్తి చేయటాన్ని తమ కంపెనీ సహించబోదని పేర్కొంది. ఏమైనా సదరు యువతి వీడియో చైనా ప్రభుత్వానికి చిరాగ్గా మారిందన్న మాట వినిపిస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News