కరోనా సెకండ్ వేవ్ ... ఏపీలో మరో కంటైన్మెంట్ జోన్ .. !

Update: 2021-04-26 11:57 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే మరణాలు కూడా ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. దీనితో రాష్ట్ర ప్రజల్లో ఆందోళన రోజురోజుకి పెరిగిపోతుంది.  రోజు రోజుకూ ఊహించని స్థాయిలో వైరస్ విస్తరిస్తోంది. గతంతో పోల్చుకుంటే పాజిటివ్ నిర్ధారణ అయిన వారి సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. కరోనా  కట్టడి చేయడానికి లాక్ డౌన్ సరైన మార్గమే అయినా దాన్ని ఆఖరి ఆస్త్రంగానే వాడాలి అంటున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. దీంతో  చాలా చోట్ల ప్రజలే స్వచ్చందంగా లాక్ డౌన్ కు ముందుకు వస్తున్నారు. భారీగా కేసులు నమోదవుతున్న చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు  జిల్లాల్లో వ్యాపార సంఘాలే సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో తిరుపతి నగర పాలక కమిషనర్ గిరీషా నగరాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. తిరుపతి కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్ లో కరోనా కేసులు ఉండటంతో మొత్తం పట్టణాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. మరోవైపు రేపటి నుండి తిరుపతిలో మధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలు ఉంటాయని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. ఇక ,మధ్యాహ్నం 2 తర్వాత స్వచ్చందంగా దుకాణాలు మూసివేసేందుకు చాంబర్ ఆఫ్ కామర్స్ అంగీకారం తెలిపిందన్నారు. ఆటోలు, జీపుల్లో పరిమిత సంఖ్యో ప్రయాణికులను అనుమతిస్తున్నట్లు చెప్పారు. గంగమ్మ జాతరను ఏకాంతంగా జరిపేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ గిరీషా పట్టణ ప్రజాసంఘాల ప్రతినిధులతో, వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అందరి ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసులు బాగా పెరుగుతున్నందున ఇక ముందు కరోనాను కట్టడి చేసే బాధ్యత ప్రజలమీదే ఎక్కువగా ఉంటుందని , ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధ్యతాయుతంగా మెలగాలని అన్నారు. ఇక కరోనా భయం వల్ల తిరుపతికి యాత్రికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. నిన్న  తిరుమల సందర్శించిన వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆదివారం తిరుమలను 16వేల 560 మంది సందర్శించారు. తలనీలాలు సమర్పించిన వారు 8,191 మంది. శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.21 కోట్లు. శనివారం 23వేల 998 మంది తిరుమలను సందర్శించారు.
Tags:    

Similar News