తిరుపతి ఉప ఎన్నిక.. వైసీపీ అభ్యర్థిగా కొత్తపేరు?

Update: 2020-11-20 12:10 GMT
ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక వేడి మొదలైంది. టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో అధికార వైసీపీ కూడా అలెర్ట్ అయ్యింది. తిరుపతి వైసీపీ ఎంపీ దుర్గా ప్రసాద్ మరణంతో ఖాళీ అయిన సీటులో ఎవరిని నిలబెట్టాలనేది సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, చిత్తూరు జిల్లా నేతలతో చర్చించారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అయితే నేతలంతా సీఎం జగన్ కే పార్టీ అభ్యర్థి ఎంపిక బాధ్యతను అప్పగించారని తెలిసింది. దీంతో జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠంగా మారింది.

ప్రస్తుతం వైసీపీ అధిష్టానం పరిశీలనలో చనిపోయిన ఎంపీ దుర్గాప్రసాద్ కుమారుడు కల్యాణ్ చక్రవర్తి ఉన్నారు. ఆయనను దింపాలా? లేదంటే మరో సీనియర్ కు సీటు ఇవ్వాలా అన్నది జగన్ తేల్చనున్నారు.

జగన్ పాదయాత్రలో తనతో కలిసి నడిచిన ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తి పేరు కూడా తిరుపతి ఎంపీ బరిలో వినిపిస్తోంది. అయితే ముందుగా దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను పిలిచి వారి అభిప్రాయం తీసుకొని ముందుకెళ్లాలని జగన్ భావిస్తున్నట్టు తెలిసింది. కల్యాణ్ కు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ ఇచ్చేలా ప్రస్తావన తేవాలని వైసీపీ అధిష్టానం యోచిస్తోందట..  వచ్చే మార్చిలో ఎమ్మెల్సీ పదవులు ఖాళీలు కానుండడంతో ఆ సీటు ఇచ్చేలా ప్రతిపాదన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై వైసీపీ వర్గాల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

ఇక వైసీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా కలిసి పనిచేస్తామని తిరుపతి నేతలంతా జగన్ కు హామీ ఇచ్చారు. సీఎం జగన్ నిర్ణయమే ఇప్పుడు కీలకంగా మారింది.
Tags:    

Similar News