కోదండ‌రాంకు ఇక టైం బాగోలేన‌ట్టే!

Update: 2017-08-11 12:41 GMT
తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా సాధించుకోవ‌డం కోసం జ‌రిగిన ఉద్య‌మంలో ప్రొఫెస‌ర్ కోదండ‌రాం పాత్ర మ‌రువ‌లేనిది. 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని సజీవంగా ఉంచ‌డంలో టీఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు కీల‌క భూమిక పోషిస్తే... ఉద్య‌మాన్ని ఉధృతం చేయ‌డంలో మాత్రం కోదండ‌రాందే ప్ర‌ధాన పాత్ర అని చెప్పాలి. గ‌తంలో తెలంగాణ కోసం అలుపెర‌గని పోరు సాగించిన ప్రొఫెస‌ర్ జ‌యశంక‌ర్‌ కు నీరాజ‌నాలు ప‌లుకుతున్న టీఆర్ ఎస్... కోదండ‌రాంను కూడా అదే త‌ర‌హాలో ట్రీట్ చేస్తుంద‌ని అంతా భావించారు. అయితే ప‌రిస్థితి అందుకు భిన్నంగా త‌యారైంద‌నే చెప్పాలి.

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావ‌డం, ఆ వెనువెంట‌నే వ‌చ్చిన ఎన్నిక‌ల్లో ఉద్య‌మాన్ని ముందుండి న‌డిపిన టీఆర్ఎస్‌కు అధికారం ద‌క్క‌డం, కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం వెంటవెంట‌నే జ‌రిగిపోయాయి. ఈ క్ర‌మంలో కోదండ‌రాం... కేసీఆర్ స‌ర్కారులో కీల‌క భూమిక పోషిస్తార‌ని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా టీఆర్ ఎస్ - కోదండ‌రాంల మ‌ధ్య నానాటికీ దూరం పెరిగిపోయింది. తెలంగాణ‌ను తెచ్చుకుంది గ‌డీల పాల‌న‌ను పార‌దోలేందుకేన‌ని, అయితే అందుకు విరుద్ధంగా కేసీఆర్ పాల‌న‌ను సాగిస్తోంద‌ని కోదండ‌రాం గ‌ళం విప్పారు. ఈ క్ర‌మంలో కోదండ‌రాం నేతృత్వం వ‌హిస్తున్న టీజేఏసీ - టీఆర్ ఎస్‌ లు బ‌ద్ధ శ‌త్రువులుగా మారిపోయాయి.

కాల‌క్ర‌మంలో కోదండ‌రాం ను అరెస్ట్ చేయించే విష‌యంలోనూ కేసీఆర్ స‌ర్కారు ఏమాత్రం వెనుకాడ‌టం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ వాద‌న‌ను నిజం చేస్తూ ఇప్ప‌టికే ఓ ద‌ఫా కోదండ‌రాం అరెస్ట్ కాగా.... నేటి మ‌ధ్యాహ్నం మ‌రోమారు ఆయ‌నను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి ఏకంగా స్టేష‌న్‌ కు త‌ర‌లించారు. ఆ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... కామారెడ్డి జిల్లా సరిహద్దు బస్వాపూర్‌ వద్ద ఈ రోజు మ‌ధ్యాహ్నం కోదండ‌రాంను పోలీసులు అరెస్టు చేశారు. అవినీతికి వ్య‌తిరేకంగా యాత్ర‌ను ప్రారంభించిన కోదండ‌రాం త‌న అనుచ‌రుల‌తో క‌లిసి ఆ కార్య‌క్ర‌మాన్ని నేటి ఉద‌యం ప్రారంభించారు. అయితే బ‌స్వాపూర్ వ‌ద్ద‌కు యాత్ర చేరుకోగానే ఎంట్రీ ఇచ్చిన పోలీసులు కోదండ‌రాంతో పాటు ఆయ‌న అనుచ‌ర‌గ‌ణాన్ని కూడా అరెస్ట్ చేసి, కోదండరామ్‌ను బిక్కనూరు పోలీస్‌స్టేషన్ కు త‌ర‌లించారు.

ఈ విష‌యం తెలుసుకున్న బీజేపీ నేత‌లు పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు చేరుకుని పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు. కోదండ‌రాంకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద ఉద్రిక్త‌త నెలకొంది. కోదండ‌రామ్ అరెస్టును ఖండిస్తూ ప‌లు ప్రాంతాల నుంచి టీజేఏసీ కార్య‌క‌ర్త‌లు భారీగా ఆ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు త‌ర‌లివ‌చ్చారు. అక్క‌డ‌కు చేరుకున్న ప‌లువురు కళాకారులు సీఎం కేసీఆర్‌ కి వ్య‌తిరేకంగా పాట‌లు పాడారు. ఇదిలా ఉంటే... త‌మ యాత్ర‌ను కొన‌సాగిస్తామ‌ని కోదండ‌రాం పోలీసుల‌ను కోరగా, పోలీసులు అందుకు ఒప్పుకోలేదు. తాము యాత్ర చేసుకునేందుకు అనుమ‌తి ఉన్న‌ప్ప‌టికీ పోలీసులు అడ్డుకోవ‌డం ఏంట‌ని కోదండ‌రాం మండిప‌డ్డారు. అవినీతిని ప్రశ్నిస్తామనే పాలకులు యాత్ర‌కు ఆటంకాలు సృష్టిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యాత్ర కొన‌సాగిస్తామ‌ని అన్నారు.
Tags:    

Similar News