టోక్యో ఒలింపిక్స్ అథ్లెట్ల‌కు కండోమ్‌లు

Update: 2021-06-09 15:30 GMT
ప్ర‌పంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరం అయిన ఒలింపిక్స్ కోసం వివిధ దేశాల నుంచి ప‌ది వేల మందికి పైగానే అథ్లెట్లు వెళ్తారు. ఈ మెగా ఈవెంట్లో పోటీ ప‌డి ప‌త‌కం సాధించ‌డాన్ని జీవితాశయంగా పెట్టుకున్న అథ్లెట్లు ఏళ్ల త‌ర‌బ‌డి క‌ష్ట‌ప‌డ‌తారు. అంత క‌ష్ట‌ప‌డి ఆతిథ్య దేశానికి వెళ్లాక పోటీ ప‌డే ముందు ఎంత ఒత్తిడికి గుర‌వుతారో అంచ‌నా వేయ‌డం క‌ష్టం. ఆ ఒత్తిడి నుంచి ఉప‌శ‌మ‌నం కోసం స‌హ‌చ‌ర అథ్లెట్ల‌తో, లేదా వేరే అమ్మాయిల‌తో శృంగారంలో పాల్గొనే క్రీడాకారులు చాలామందే ఉంటారు. వీళ్లు సుర‌క్షిత శృంగారంలో పాల్గొనేలా చూసేందుకు, అలాగే సుర‌క్షిత శృంగారంపై అవ‌గాహ‌న పెంచేందుకు నిర్వాహ‌కులు అథ్లెట్ల‌కు కండోమ్‌లు స‌ర‌ఫ‌రా చేయ‌డం ఆన‌వాయితీ. ప్ర‌తి ఒలింపిక్స్‌లోనూ ఇది జ‌రుగుతుంది. ఐదేళ్ల కింద‌ట రియో ఒలింపిక్స్‌లోనూ ఇలాగే చేశారు. ఇంకో నెల‌న్న‌ర రోజుల్లో మొద‌ల‌య్యే టోక్యో ఒలింపిక్స్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు.

కాక‌పోతే క‌రోనా ముప్పు పొంచి ఉన్న వేళ.. అథ్లెట్ల‌కు కండోమ్‌లు ఇచ్చి వాళ్ల‌ను శృంగారంలో పాల్గొన‌మ‌ని ప్రోత్స‌హించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అనే ప్ర‌శ్న త‌లెత్త‌డం స‌హ‌జం. ఈ నేప‌థ్యంలో ఈసారి అథ్లెట్ల‌కు కండోమ్‌లు ఇవ్వ‌రేమో అనుకున్నారు. కానీ టోక్యో ఆర్గ‌నైజ‌ర్స్ ఆన‌వాయితీ త‌ప్ప‌ట్లేదు. అథ్లెట్ల‌కు కండోమ్‌లు అందిస్తున్నారు. మొత్తంగా ల‌క్షా 60 వేల కండోమ్‌ల‌ను ఒలింపిక్ గ్రామంలో పంచ‌బోతున్నార‌ట‌. ఐతే ఆ కండోమ్‌ల‌న్నీ ఇక్క‌డ వాడేయొద్ద‌ని.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో శృంగారం మంచిది కాద‌ని.. వాటిని జ్ఞాపిక‌లుగా భావించి త‌మ ఇళ్ల‌కు తీసుకెళ్లాల‌ని.. సుర‌క్షిత శృంగారంపై త‌మ చుట్టు ప‌క్క‌ల వాళ్ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని నిర్వాహ‌కులు చెబుతున్నారు. గ‌త ఏడాదే జ‌ర‌గాల్సిన ఒలింపిక్స్ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. టోక్యో వేదిక‌గా జులై 23 నుంచి ఆగ‌స్టు 8 వ‌ర‌కు క్రీడ‌లు జ‌ర‌గాల్సి ఉంది.
Tags:    

Similar News