యాస‌ను తిట్టార‌న్నోళ్ల‌కు స‌న్మానాలా కేసీఆర్‌?

Update: 2017-12-19 09:30 GMT
ఏం చేసినా కేసీఆర్ మాత్ర‌మే చేయాలి. తిట్టినా.. పొగిడినా కేసీఆర్‌కు మాత్ర‌మే సాధ్యం. ఏ పేరు చెప్పి ఉమ్మ‌డి రాష్ట్రం ముక్క‌ల‌య్యేలా చేశారో.. ఏ విష‌యం కార‌ణంగా తెలంగాణ ఆత్మాభిమానం అంటూ కోట్లాది మంది తెలంగాణ ప్ర‌జ‌ల గుండెల్ని ట‌చ్ చేశారో.. ఎవ‌రి స్వాభిమానం కోసం తాను పోరాడ‌తాన‌ని.. అవ‌స‌ర‌మైతే ప్రాణాలు ఇవ్వ‌టానికైనా సిద్ధ‌మేన‌ని చెప్పారో.. ఇప్పుడు అదే వారిని కౌగిలించుకుంటున్న తీరు చూస్తే.. ఇలాంటివి కేసీఆర్‌ కు మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెప్పాలి.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం కేసీఆర్ చేసిన ఉద్య‌మంలో ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించిన అంశాల్లో నీళ్లు.. నిధులు.. నియామ‌కాలు అన్న మూడింటితో పాటు.. తెలంగాణ ప్ర‌జ‌లు మ‌నసుల్ని ట‌చ్ చేసిన మ‌రో మాట‌.. తెలంగాణ యాస‌ను వెకిలి చేయ‌టం. సీమాంధ్రుల క‌బంధ హ‌స్తాల్లో ఉన్న తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ తెలంగాణ యాస‌ను వెకిలిగా చూపించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆవేశాన్ని ప్ర‌ద‌ర్శించారు. తెలంగాణ వాళ్లంటే ఇంత చుల‌క‌నా? అంటూ పిడికిలి బిగించారు. ఉద్య‌మ వేళ‌లో కేసీఆర్ మాట‌లు విన్నోళ్ల చాలామంది ర‌క్తం మ‌రిగిపోయింది. నిజ‌మే క‌దా.. ఇంత అన్యాయం చేస్తారా? అంటూ సినిమా వాళ్ల‌కు సీమాంధ్ర ముద్ర వేసేశారు.

రాష్ట్ర విడిపోయి.. రెండు ముక్క‌లై ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర నాలుగేళ్లు అవుతున్న వేళ కూడా.. విభ‌జ‌న మాట‌ల్ని.. నాటి అవ‌మానాల్ని.. త‌మ యాస‌ను.. సంస్కృతిని చిన్న‌బుచ్చారంటూ ఆరోప‌ణ‌లు చేసే కేసీఆర్‌.. ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌ల పేరుతో నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మంలో భాగంగా చేప‌ట్టిన బృహ‌త్ స‌న్మానాలు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. ఏ సినిమా రంగ‌మైతే.. త‌మ యాస‌ను చిన్న‌బుచ్చేలా.. విల‌న్ క్యారెక్ట‌ర్ల ద్వారా త‌ప్పుడు సందేశాల్ని పంపుతుంద‌న్న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కేసీఆర్‌.. త‌మ‌ను చుల‌క‌న చేస్తున్నారంటూ మండిపాటు ప్ర‌ద‌ర్శించిన అధినేత పుత్ర‌ర‌త్నం  సాక్షిగా తెలుగు సినీ ప్ర‌ముఖుల‌కు స‌న్మానం చేసిన తీరు చూస్తే.. అనిపించేది ఒక్క‌టే..యాస‌ను వెకిలి చేశార‌న్న మాట ఇక‌పై అంటే కుద‌ర‌దు. ఎందుకంటే.. ఎవ‌రైతే తెలంగాణ యాసను వెకిలి చేశార‌ని ఆరోపించారో ఇప్పుడు వాళ్ల‌నే అక్కున చేర్చుకొని శాలువా క‌ప్పి స‌త్క‌రించిన వేళ‌.. ఇక‌పై సీమాంధ్రుల పేరు చెప్పి ఈస‌డిస్తే ఎంత‌మాత్రం బాగోదు. దుర‌దృష్ట‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. సీమాంధ్ర పాల‌కులు.. సీమాంధ్ర సినిమా వాళ్లు అంటూ ఎవ‌రి పేరును చెప్పి విభ‌జ‌న కోరారు.. ఇప్పుడు వారంతా స‌త్కారాలు.. వ్యాపారాలు హాయిగా చేసుకుంటే.. ఏ మాత్రం సంబంధం లేని సీమాంద్ర‌ప్ర‌జ‌లు మాత్రం  మాట ప‌డాల్సి వ‌చ్చింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. జ‌రిగింది వ‌దిలేసినా.. రానున్న రోజుల్లో త‌మ యాస‌ను వెకిలి చేశార‌న్న ఆరోప‌ణ సినిమా ఇండ‌స్ట్రీ మీద కేసీఆర్ చేసే హ‌క్కును కోల్పోయార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News