బ్రేక్? : ట్రాన్స్ ట్రాయ్ కోర్టుకు వెళుతుందా?

Update: 2018-02-10 05:42 GMT
పోలవరం పనుల్ని చంద్రబాబు అనుకుంటున్నంత వేగంగా పూర్తి చేయడానికి, కేంద్రం కోరుకుంటున్నట్లుగా పాతధరలకే పనులు చేయడానికి నవయుగ సంస్థ ముందుకు రావడంతో ఒక ఆటంకం తొలగిందని అంతా అనుకున్నారు. నవయుగ సంస్థ స్పిల్ ఛానెల్ నిర్మాణానికి కాంట్రాక్టు పనులకు శ్రీకారం చుట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే తమ నుంచి కొన్ని పనులను తొలగించి ఇతర సంస్థలకు కేటాయించడంలో లోపాలు ఉన్నాయని.. ఈ విషయంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని ఇదివరలో ప్రకటించిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థ ఇప్పుడు అలాంటి ప్రయత్నాల్లో ఉన్నట్లుగా కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. దానికి సహేతుకమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి.

స్పిల్ ఛానెల్ - స్పిల్ వే నిర్మాణాలు ఇతరత్రా కలిపి ప్రస్తుతం 1244 కోట్ల రూపాయల విలువ చేసే పనులను ట్రాన్స్ ట్రాయ్ నుంచి వేరు చేసి నవయుగకు అప్పగించారు. అసలు నిర్మాణంలో తమకు తగిన సమయం ఇవ్వకుండా - నిదులు సకాలంలో విడుదల చేయకుండా - జాప్యం జరుగుతున్నదనే నింద తమ మీద వేసి.. తమ నుంచి పనులను తప్పించడమే ఒప్పంద నిబంధనలకు విరుద్ధం అని పాత కాంట్రాక్టరు చాలా కాలం నుంచి అంటూనే ఉన్నారు. పైగా ఇప్పుడు నవయుగకు కేటాయించిన పనుల మీద వారు కొత్త పితలాటకం కూడా పెడుతున్నారు. ఆ మొత్తం పనుల విలువ 1192 కోట్లు మాత్రమేనని ఆ సంస్థకు 52 కోట్లు అదనంగా కేటాయిస్తున్నారని వారు వాదిస్తున్నారు. అంటే ఆ మేరకు పాత కాంట్రాక్టరుకు అదనపు నష్టం వాటిల్లుతుందనేది వారి మాటలాగా కనిపిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై వారు కోర్టుకు వెళ్లదలచుకుంటే గనుక.. సమస్య తప్పదని పలువురు అంచనా వేస్తున్నారు.

పోలవరం పనులు ఆది నుంచి అనేక బాలారిష్టాల మధ్య ఈసురోమంటూ సాగుతున్నాయి. ఇప్పటికీ పూర్తి స్థాయి జాతీయ ప్రాజెక్టు అయిన దీనికోసం కేంద్రం ఏ రకంగా నిధుల విషయంలో బాధ్యత తీసుకుంటున్నదనే క్లారిటీ రావడం లేదు. నాబార్డు నుంచి రుణాలు ఇప్పిస్తాం అని మాత్రమే వారు చెబుతున్నారు. మరి ఆ రుణాలు కూడా పనులు వేగంగా జరగడానికి సరిపడేంతగా విడుదల కావడం లేదు. కాంట్రాక్టర్లు నిధుల విడుదలలతో ముడిపెట్టి కనీసం కూలీలకు జీతాలు కూడా ఇవ్వకుండా.. పనుల్లో ప్రతిష్టంభనకు కారణం అవుతున్నారు. మరి.. ఈ నవయుగ వారి పనులైనా బ్రేకుల్లేకుండా సజావుగా సాగుతాయో లేదో చూడాలి.
Tags:    

Similar News