ప్రయాణం 'రిస్క్'.. ప్రతి విమానంలో కరోనా ఆనవాళ్లు..!

Update: 2023-01-09 16:30 GMT
ప్రపంచాన్ని రెండేళ్లు గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి అందరినీ భయపెడుతోంది. కోవిడ్ నిబంధనలు పాటించడంతోపాటు కరోనా వ్యాక్సిన్ తో అందుబాటులోకి రావడంతో అన్ని దేశాల్లోనూ మళ్లీ మునుపటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనాలో కరోనా కేసులు ప్రతీరోజు లక్షల్లో నమోదు అవుతుండటం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.

చైనాలో జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తివేయడం.. నాసిరకం వ్యాక్సిన్లను ప్రభుత్వం పంపిణీ చేయడం వల్లే ఆ దేశంలో ఈ పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే చైనా మాత్రం విదేశీ కుట్రలో భాగంగా తమ దేశంపై ఆంక్షలను విధిస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలో విదేశీ ప్రయాణీకులపై ఉన్న ఆంక్షలన్నీంటిని చైనా ఎత్తివేసింది.

దీంతో అన్ని దేశాలు సైతం కరోనాపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. చైనీయులు తమ దేశంలోకి వస్తే క్వారంటైన్ చేసిన తర్వాత అనుమతిని ఇస్తున్నాయి. దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమపై ఆంక్షలు విధిస్తే ప్రతీకారం తప్పదంటూ హెచ్చరికలు సైతం జారీ చేస్తుంది.

ఇదిలా ఉంటే మలేషియాలో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించేందుకు తాజాగా అధ్యయనం చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం గాల్లో ఎగురుతున్న ప్రతి విమానంలో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. మలేషియా నేషనల్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీ ప్రకారంగా కౌలాలంపూర్‌లోని 29 విమానాల నుంచి తీసిన మురుగునీటి నమూనాల్లో 28 వాటిల్లో కరోనా వైరస్ ను గుర్తించారు.

29వ నమూనాపై ఇంకా పరీక్ష జరుగుతుంది. ఈ శాంపిల్స్ లోనూ కరోనా వైరస్ ఉందని తేలింది వందశాతం విమానాల్లో కరోనా వైరస్ ఉందని స్పష్టమవుతుంది. ఈ శాంపిళ్లను జూన్ నుంచి డిసెంబర్ 2022 వరకు అంతర్జాతీయ ఎంట్రీ పాయింట్ల వద్ద సేకరించారు. అదే సమయంలో దేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 15 సెంటినల్ స్థానాల నుంచి 301 నమూనాలను పరీక్షించారు.

ప్రస్తుతం ప్రయాణిస్తున్న విమానాల్లో 95.7% వాటిలో "Sars CoV-2 288 వైరస్ నమునాలను గుర్తించినట్లు ఆరోగ్య డైరెక్టర్ జనరల్ డాక్టర్ నూర్ హిషామ్ అబ్దుల్లా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎయిర్‌క్రాఫ్ట్ మురుగునీటి నిఘా ప్రక్రియలో శుద్ధి చేయని మురుగు నీరు.. మురుగు కాలుష్యం కోసం శాంపిల్స్ పరీక్ష చేసినట్లు వెల్లడించారు.

వీటిలో SARS-CoV-2 వైరస్ యొక్క ఆర్ఎన్ఎ మూలాలు ప్రయాణికుడి ఆరోగ్యంతో సంబంధం లేకుండా మలంలో కనిపిస్తాయని తెలిపారు. వీటిని మురుగునీటిలో గుర్తించవచ్చని చెప్పారు. ఈ వైరస్ ఈ రూపం అంటువ్యాధి మాత్రం కాదని.. మలం ద్వారా సంక్రమించదని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా ముందుగానే కోవిడ్ ప్రమాదంలో ఉన్న దేశాలను గుర్తించి హెచ్చరించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News