తప్పుడు మ్యాప్ .. ట్విట్టర్ ఎండీపై రాజద్రోహం కేసు !

Update: 2021-06-29 07:30 GMT
భారతదేశం మ్యాప్‌ ను ట్విట్టర్ మళ్లీ తప్పుగా చూపించడం పట్ల దేశంలో పలు ప్రాంతాల్లో ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ట్విట్టర్ చర్యలపై తీవ్ర దుమారం రేగడంతో ఆ మ్యాప్‌ వెబ్‌సైట్ నుండి తీసేసింది. తాజాగా, ట్విట్టర్ ఇండియా చీఫ్ మనీశ్ మహేశ్వరి పై యూపీలో ఎఫ్ ఐ ఆర్ నమోదు అయ్యింది. ఈ నెలలో ట్విట్టర్‌ కు వ్యతిరేకంగా యూపీలో నమోదయిన రెండో కేసు. ఇండియా మ్యాపును తప్పుగా చూపించిన ట్విట్టర్‌ పై బజరంగ్ దళ్ నేత ప్రవీణ్ భాటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యూపీ పోలీసులు ట్విట్టర్ ఎండీ పై కేసు నమోదు చేశారు. ట్విట్టర్ ఉద్దేశపూర్వకంగా రాజద్రోహానికి పాల్పడింది, చర్యలు తీసుకోవాలని అని ప్రవీణ్ భాటి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఐపీసీ సెక్షన్ 505 (2), ఐటీ చట్టం సెక్షన్ 74 కింద కేసు నమోదయ్యింది. మనీశ్ మహేశ్వరితోపాటు ట్విట్టర్ ఇండియా న్యూస్ విభాగం హెడ్ అమృత త్రిపాఠీ పేరును కూడా చేర్చారు.

గతవారం ఘజియాబాద్‌ లో ఓ ముస్లిం వ్యక్తిపై కొందరు దాడిచేసి ‘జై శ్రీరామ్’ అని పలకాలని బలవంతం చేసినట్టు పెట్టిన పోస్ట్‌పై యూపీ పోలీసులు కేసు నమోదుచేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ట్విట్ట‌ర్లో ఓ పోస్ట్ ను కొంద‌రు వైర‌ల్ చేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై వివరణ ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు. ఈ కేసుపై ఆయ‌న‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీంతో యూపీ పోలీసులు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే మ‌రో కేసు ఆయ‌న‌పై న‌మోదైంది. కేంద్ర ప్ర‌భుత్వానికి, ట్విట్ట‌ర్‌ కు మ‌ధ్య కొన్ని రోజులుగా వివాదం కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. దేశంలో లోని చ‌ట్టాల ప్ర‌కార‌మే ట్విట్ట‌ర్ న‌డుచుకోవాల‌ని కేంద్రం స్ప‌ష్టం చేస్తోంది. అయితే, ఈ విష‌యంలో ట్విట్ట‌ర్ తీరు మార్చుకోక‌పోవ‌డంతో మధ్యవర్తి హోదాను తొల‌గిస్తూ కేంద్ర ప్రభూత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది.
Tags:    

Similar News