ఎంత సారు బర్త్ డే అయితే మాత్రం ఈ హడావుడేంది?

Update: 2020-02-14 06:30 GMT
రాజు పంది అంటే పంది. నంది అంటే నంది అన్న సామెతలు ఉన్నాయి. పాలకులు ఎంత పవర్ ఫుల్ అన్న విషయాన్ని ఈ సామెతలు చెప్పేస్తుంటాయి. అధికారం చేతిలో ఉన్నోడు ఏమైనా చెప్పొచ్చు.దానికి ఎదురు చెప్పే వీలు ఉండదు. ఈ మాటకు తగ్గట్లే తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఉన్నాయని చెప్పాలి.

ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు. మరి.. సారు బర్త్ డే వేళ.. హడావుడి చేయాలి కదా.అందునా అది 66వ పుట్టిన రోజు కావటంతో.. ఆ రోజు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలంటూ ప్రకటన విడుదల చేశారు మంత్రి కేటీఆర్. చిన్నసారు వారి నోటి నుంచి ఏదైనా మాట వచ్చిందంటే.. పెద్ద సారు వారి మదిలో ఉన్నదే అన్న విషయం తెలిసిందే.

తిరుగులేని అధికారం చేతిలో ఉన్న పెద్ద సారు బర్త్ డేను భారీగా మొక్కలు నాటటం ద్వారా గ్రాండ్ గా చేయాలన్న ఆదేశం వచ్చింది మొదలు.. ఒకరి తర్వాత ఒకరు.. ప్రభుత్వంలోని ఒక శాఖ తర్వాత మరో శాఖ ముఖ్యమంత్రి పుట్టిన రోజున భారీ ఎత్తున మొక్కలు నాటాలని డిసైడ్ అయ్యారు. ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ.. మొక్కలు నాటటం అన్నది వర్షాకాలంలో చేయాలి.

ఎందుకంటే.. ఇప్పుడు నాటే మొక్కలు ఎవరికి వారి ఇళ్లల్లో కాదు. ఖాళీ ప్రదేశాల్లో.. బహిరంగ ప్రదేశాల్లో అన్నది మర్చిపోకూడదు. నాటే రోజు బాగానే ఉన్నా.. తర్వాతి కాలంలో దాని బాగోగులు చూసుకోవాల్సింది ఎవరు? అన్న ప్రశ్న దగ్గర సమాధానం కోసం అటు ఇటు వెతకాల్సిందే. అందునా.. ఫిబ్రవరి మూడో వారంలో అడుగు పెట్టే వేళలో ఎండ తీవ్రత పెరగటం మొదలవుతుంది. అది అంతకంతకూ పెరగటమే కానీ తగ్గేది ఉండదు. ఇలాంటి వాతావరణంలో నాటే చిన్న మొక్కల్ని జాగ్రత్తగా చూసుకుంటే తప్పించి బాగా పెరగవు.

ఇన్ని తిప్పలు ఉన్న వేళ.. సారు పుట్టినరోజు కోసం నాటే మొక్కల కోసం పెట్టే ఖర్చు మాటేంది? ఇదంతా ఒక ఎత్తు.. కొన్నేళ్లుగా హరితహరం పేరుతో కోట్లాది మొక్కలు నాటినట్లుగా రికార్డులు చెప్పటమేకాదు.. అందుకు వందలాది కోట్లు ఖర్చు చేశారు. వాటి మాటేమిటి? నాటిన కోట్లాది మొక్కల్లో ఎన్ని బతికి ఉన్నాయి. ఏ స్థాయిలో ఉన్నాయన్నది కాస్త చూస్తే.. తాజా మొక్కలు నాటే ప్రోగ్రాం ఎంత కామెడీనో తేలిపోతుంది. ప్రచారానికి తప్పించి..మరెలాంటి ప్రయోజనం లేని ఈ తరహా కార్యక్రమాలతో పర్యావరణానికి ఎలాంటి మేలు జరగదన్నది మర్చిపోకూడదు.


Tags:    

Similar News